SPECIAL EDITION DAILY
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 9:42 am Posted by : SPECIAL EDITION DAILY

అక్రిడేషన్‌కు అవమానం..! జర్నలిస్టుపై ఎస్సై జులుం..!

-అక్రిడేషన్ కార్డుకు విలువ లేదన్న ఎస్సై

-విధి నిర్వహణలో ఫోటో జర్నలిస్టుకు అవమానం

-దేవస్థానంలో లోనికి అనుమతించని పోలీసులు

-ఫోర్త్ ఎస్టేట్ గౌరవంపై మరో దెబ్బ

-ప్రత్యేక జీవో తీసుకురావాలని జర్నలిస్టుల డిమాండ్

-అన్ని శాఖలకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి

(ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా గుర్తింపు పొందిన జర్నలిజం గౌరవానికి బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో జరిగిన ఘటన మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన స్టేట్ అక్రిడేషన్ కార్డును చూపించి విధి నిర్వహణకు వచ్చిన ఓ ఫోటో అండ్ వీడియో జర్నలిస్టును విధుల్లో ఉన్న ఓ ఎస్సై అడ్డుకోవడమే కాకుండా, “నీ అక్రిడేషన్‌కు ఎలాంటి వ్యాల్యూ లేదు… ముందు బయటికి నడువు” అంటూ బహిరంగంగా అవమానించారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.)

హైదరాబాద్/బల్కంపేట, జూలై 22 (స్పెషల్ ఎడిషన్): బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో జరుగుతున్న ఆలయ కార్యక్రమాలను కవర్ చేయడానికి ఓ స్టేట్ అక్రిడేషన్ ఫోటో అండ్ వీడియో జర్నలిస్టు కెమెరా బ్యాగును మెడలో ధరించి, కెమెరాతో ఆలయానికి చేరుకున్నారు. అయితే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న ఎస్సై ఆయనను గేటు వద్దే అడ్డుకొని లోనికి అనుమతించలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సందర్భంగా సదరు జర్నలిస్టు తన రాష్ట్ర ప్రభుత్వ అక్రిడేషన్ కార్డును చూపిస్తూ, “నేను ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడేషన్ జర్నలిస్టును… విధి నిర్వహణ కోసం వచ్చాను… లోపలికి వెళ్లి ఫోటోలు తీయనివ్వరా..? నా అక్రిడేషన్‌కు విలువ లేదా..?” అని ప్రశ్నించగా, ఎస్సై “నీ అక్రిడేషన్‌కు ఎలాంటి వ్యాల్యూ లేదు… లేదు… లేదు…” అంటూ పలుమార్లు కఠినంగా మాట్లాడి, “ముందు సైడ్‌కు జరుగు… బయటికి నడువు” అని ఆదేశించినట్లు వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా తెలుస్తోంది. అధికారిక గుర్తింపు కార్డు కలిగిన జర్నలిస్టును అందరి ఎదుట అవమానకరంగా బయటకు పంపించడం అక్కడున్న భక్తులతో పాటు ఇతర మీడియా ప్రతినిధులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటన బయటకు రావడంతో జర్నలిస్టు సంఘాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ కార్డుకే ఒక పోలీసు అధికారి విలువ లేదని వ్యాఖ్యానించడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, రాష్ట్రంలోని మొత్తం జర్నలిస్టు సమాజం గౌరవాన్ని కించపరిచిన చర్య అని సంఘాల నాయకులు మండిపడ్డారు. ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించేందుకు ఫోటో, వీడియో జర్నలిస్టులు ప్రమాదాలను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటారని, అలాంటి వారిని విధి నిర్వహణలో అడ్డుకోవడం, అవమానించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, ప్రమాదకర సంఘటనలు, ప్రజా ఉద్యమాలు… ఇలా ప్రతి సందర్భంలోనూ ప్రజల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేసే జర్నలిస్టులకు అధికారుల నుంచే ఇలాంటి అవమానాలు ఎదురవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇది ఒక్క బల్కంపేట ఘటన మాత్రమే కాదు. అనేక ప్రభుత్వ శాఖల్లో అక్రిడేషన్ కార్డులను గుర్తించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రతి చోట మా గుర్తింపును నిరూపించుకోవాల్సి వస్తోంది. అధికారుల ఎదుట వివరణలు ఇస్తూ మానసికంగా కుంగిపోతున్నాం” అంటూ పలువురు అక్రిడేషన్ జర్నలిస్టులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిజం సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారానికి మార్గం చూపుతుందని, అలాంటి వృత్తిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని జర్నలిస్టు సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఒకవైపు అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు సకాలంలో అందడం లేదనే విమర్శలు వస్తుండగా, మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ కార్డునే అధికారులు గుర్తించకపోవడం మరింత ఆందోళనకరమని పేర్కొన్నాయి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, పోలీసు శాఖ, దేవాదాయ శాఖతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలకు అక్రిడేషన్ జర్నలిస్టుల హక్కులు, విధులపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ కార్డును అన్ని శాఖలు తప్పనిసరిగా గుర్తించేలా ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) తీసుకురావాలని, అధికారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరాయి. బల్కంపేట ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, “అక్రిడేషన్‌కు విలువ లేదు” అనే వ్యాఖ్యలు చేసిన అధికారులపై శాఖాపరమైన మందలింపులు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. జర్నలిస్టు గౌరవాన్ని కాపాడటం అంటే ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడటమేనని, ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశాయి.