SPECIAL EDITION DAILY
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 5:00 pm Posted by : SPECIAL EDITION DAILY

ఆర్టీసీ బోర్డును లేపేశారు

పనామా గోడౌన్ చౌరస్తాలో ఆర్టీసీ బోర్డు తొలగింపుపై తీవ్ర ఆగ్రహం

షెల్టర్ లేక ఎండా వానలో అవస్థలు పడుతున్న ప్రయాణికులకు మరో దెబ్బ

బస్సు ఎక్కడ ఆగుతుందో తెలిపే బోర్డునే తొలగించడంపై తీవ్ర చర్చ

వనస్థలిపురం, ఆగస్టు 20 (స్పెషల్ ఎడిషన్):

వనస్థలిపురం పనామా గోడౌన్ చౌరస్తాలో అసలే బస్‌స్టాప్ షెల్టర్ లేక ఎండా వానలో అవస్థలు పడుతున్న ప్రయాణికులకు ఇప్పుడు మరో సమస్య ఎదురైంది. బస్సు ఎక్కడ ఆగుతుందో ప్రయాణికులకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బోర్డునే తొలగించిన ఘటన తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రతిరోజూ ఈ మార్గంలో ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు బస్‌స్టాప్ కోసం ఎదురుచూడటమే గగనంగా మారగా, కనీసం బస్సు ఆగే స్థలాన్ని గుర్తించేందుకు ఉన్న ఆర్టీసీ బోర్డును కూడా తొలగించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. షెల్టర్ లేదు… నీడ లేదు… ఇప్పుడు బోర్డు కూడా లేదు… మరి ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనామా గోడౌన్ చౌరస్తా వంటి రద్దీ ప్రాంతంలో ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచాల్సిన సమయంలో, ఉన్న గుర్తింపునే తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు నిలదీస్తున్నారు. వారాహి సిల్క్స్ అండ్ సిల్వర్ జువెలరీ యాజమాన్యం ఆర్టీసీ బోర్డును తొలగించినట్లు స్థానికులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కష్టంగా అక్కడ పీకేసి ఉన్న బోర్డు ఫోటో కనిపిస్తున్న దృశ్యం కళ్లకు కట్టినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. బస్‌స్టాప్ షెల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు తొలగించిన ఆర్టీసీ బోర్డును వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని, ప్రజా రవాణా సౌకర్యాలకు ఎవరూ ఆటంకం కలిగించకుండా ఆర్టీసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.