SPECIAL EDITION DAILY
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 7:57 am Posted by : SPECIAL EDITION DAILY

ఊకదంపుడు నాయకత్వమే విశ్వకర్మలకు శాపం: చేరాల జలంద్రాచారి

– పదవుల కోసం సభలు… సమాజం కోసం పోరాటం ఎక్కడని ప్రశ్న
– మాటలతో మోసం చాలదని, చేతల్లో చిత్తశుద్ధి చూపాలని డిమాండ్
– పరిశ్రమలు, ఉపాధి, ఆర్థిక స్వావలంబనపై ఉద్యమించాలన్న పిలుపు
– సమాజ ఆస్తుల లెక్కలు బహిర్గతం చేయాలని డిమాండ్

హైదరాబాద్, జులై 8 (స్పెషల్ ఎడిషన్): విశ్వకర్మ సమాజం పేరుతో భారీ సభలు, ఆర్భాట సమావేశాలు నిర్వహిస్తూ గొప్ప గొప్ప ఉపన్యాసాలు చేసే నాయకత్వం వల్ల సమాజానికి ఒరిగిందేమీ లేదని, మాటలతో కాలం గడిపిన నాయకుల కారణంగానే విశ్వకర్మలు ఇప్పటికీ ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని సామాజిక కార్యకర్త చేరాల జలంద్రాచారి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇకనైనా విశ్వకర్మ యువత వ్యక్తులను కాకుండా వారి పనితీరును ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం “విశ్వకర్మ” అనే పదాన్ని తొలగించిందంటూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న నాయకులు, ముందు రాజ్యాంగ ప్రక్రియ ఏమిటో తెలుసుకోవాలని ఆయన సూచించారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసి తిరస్కరించారా? అసలు వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను రెచ్చగొట్టడం ఎందుకని ప్రశ్నించారు. రాజకీయాల్లో విశ్వకర్మలకు ప్రాధాన్యం లేదని వేదికలపై కన్నీరు కార్చే నాయకులు, గతంలో విశ్వకర్మ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారని జలంద్రాచారి నిలదీశారు. మునుగోడు, కల్వకుర్తి వంటి ఎన్నికల్లో ఐక్యంగా నిలిచి ఉంటే చరిత్ర మారేదని, కానీ అప్పట్లో పార్టీ జెండాలు మోసిన వారే ఇప్పుడు సమాజం కోసం మాట్లాడుతున్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ పేరుతో ప్రజల్లో ఆశలు కలిగించే ముందు, జిల్లాలకు వస్తున్న ఎంఎస్‌ఎంఈ నిధులు, పరిశ్రమల రాయితీలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను విశ్వకర్మ యువతకు అందించేందుకు ఒక్కసారి అయినా జిల్లా కలెక్టర్లను కలిసి పోరాడారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యాలయాల మెట్లు ఎక్కని నాయకులు, సభల్లో మాత్రం ఉద్యమాల పేరుతో ప్రసంగించడం సమాజాన్ని మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. “పింఛన్లు ఇవ్వండి” అని ప్రభుత్వాలను వేడుకోవడం కంటే “విశ్వకర్మలు ఆదాయపు పన్ను చెల్లించే స్థాయికి ఎదిగే విధానాలు అమలు చేయండి” అని ప్రభుత్వాలను నిలదీయాలని జలంద్రాచారి స్పష్టం చేశారు. సంక్షేమం కోసం చేతులు చాచే పరిస్థితిని మార్చి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే దిశగా సమాజాన్ని నడిపించాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందన్నారు. విశ్వకర్మ బాయ్స్ హాస్టళ్లు, కమ్యూనిటీ హాళ్లు, ఫంక్షన్ హాళ్ల ద్వారా వచ్చే ఆదాయం ఎక్కడ ఖర్చవుతోందో సమాజానికి తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ఆదాయంలో కనీసం పదిశాతం కూడా విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కోసం వినియోగిస్తున్నారా? లేక కొందరి చేతుల్లోనే పరిమితమవుతోందా? అనే అనుమానాలకు నాయకత్వం సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అయితేనే విశ్వకర్మల సమస్యలు తీరిపోతాయని చెప్పే నాయకులు, గత పదేళ్లలో ఆ పదవుల్లో ఉన్నవారు సమాజానికి ఏం సాధించారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. పదవులు పొందిన తర్వాత సమాజాన్ని మరిచిపోయే నాయకత్వాన్ని విశ్వకర్మ యువత ఇకపై నిలదీయాలని పిలుపునిచ్చారు. విశ్వకర్మ సమస్యలపై ఇతర వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు స్పందించిన సందర్భాలు ఉన్నప్పటికీ, విశ్వకర్మ ప్రజాప్రతినిధుల మౌనం అనేక ప్రశ్నలకు తావిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. హక్కుల కోసం పోరాటం చేయని నాయకత్వానికి సమాజం తరఫున మాట్లాడే నైతిక హక్కు లేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. చివరగా, “వ్యక్తుల చుట్టూ తిరిగే రాజకీయాలు కాదు… విశ్వకర్మ సమాజ భవిష్యత్తు కోసం కార్యాచరణ కావాలి. సభలు పదవుల కోసం కాదు, పరిశ్రమల కోసం జరగాలి. ఉద్యమాలు టికెట్ల కోసం కాదు, విశ్వకర్మ కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం సాగాలి. యువత మేల్కొని ప్రశ్నించిన రోజే విశ్వకర్మ సమాజానికి నిజమైన మార్పు వస్తుంది” అని చేరాల జలంద్రాచారి పిలుపునిచ్చారు.