SPECIAL EDITION DAILY
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 8:04 am Posted by : SPECIAL EDITION DAILY

దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు–కంటైనర్ ఢీ

పలువురికి తీవ్ర గాయాలు.. కోదాడ ఆస్పత్రికి తరలింపు

సూర్యాపేట జిల్లా బ్యూరో/బ్రేకింగ్ న్యూస్, ఆగస్టు 26 (స్పెషల్ ఎడిషన్):  సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, దుర్గాపురం స్టేజి సమీపంలో ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కంటైనర్‌ను వేగంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, పలువురు ప్రయాణికులు వాహనంలోనే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల వివరాలు, క్షతగాత్రుల పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐదుగురు ప్రయాణికులు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.