-ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశం
-ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ
సూర్యాపేట, జూన్ 8 (స్పెషల్ ఎడిషన్):
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారి (ఎస్పీ) నరసింహ ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలను స్వీకరించి వాటిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులు తమ వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి వివాదాలు, మోసాలు, ఇతర సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను ఎస్పీకి నేరుగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను ఎస్పీ ఓర్పుగా విని, వాటి పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా, చట్టపరమైన నిబంధనల మేరకు వేగంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొన్న ఎస్పీ, ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.