SPECIAL EDITION DAILY
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 3:18 pm Posted by : SPECIAL EDITION DAILY

మాంగళ్య మాల్ మాయాజాలం

-జీహెచ్‌ఎంసీ నిబంధనలను బేఖాతరు చేస్తూ రేనోవేషన్ పనులపై ఆరోపణలు

-భద్రతా ప్రమాణాలు లేక స్థానికులు తీవ్ర ఆందోళన

-ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న పనులపై అధికారుల చర్యల కోసం డిమాండ్

హైదరాబాద్ /దిల్షుఖ్ నగర్, జులై 8 (స్పెషల్ ఎడిషన్):

హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన వాణిజ్య ప్రాంతంలో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్ రెనోవేషన్ పనులు జీహెచ్‌ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భద్రతా ప్రమాణాలను పూర్తిగా విస్మరిస్తూ చేపడుతున్న నిర్మాణ పనుల కారణంగా స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆరోపిస్తున్నారు. రెనోవేషన్ పేరిట మాల్ చుట్టూ తగిన రక్షణ ఏర్పాట్లు లేకుండా భారీ పనులు కొనసాగుతుండటంతో ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోనన్న భయాందోళన స్థానికులను వెంటాడుతోంది. నిర్మాణ ప్రాంతంలో భద్రతా కంచెలు, హెచ్చరిక బోర్డులు, పాదచారుల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రతిరోజూ వందలాది మంది ప్రమాదకర పరిస్థితుల్లోనే రాకపోకలు సాగించాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. పనుల కోసం నిర్మాణ సామగ్రిని రహదారులపై ఇష్టారాజ్యంగా నిల్వ చేయడం, వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడం, దుమ్ము, శబ్ద కాలుష్యంతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక వాహనాలు లేదా అంబులెన్స్‌లు సైతం సులభంగా వెళ్లలేని పరిస్థితులు నెలకొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ నిర్దేశించిన భవన నిర్మాణ, రెనోవేషన్ నిబంధనల ప్రకారం ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు లేకుండా పనులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, వాటిని పట్టించుకోకుండా పనులు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత శాఖల అనుమతులు, భద్రతా ప్రమాణాలు పూర్తిగా అమలవుతున్నాయా లేదా అనే అంశంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్, అగ్నిమాపక, ట్రాఫిక్ పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నట్లు తేలితే వెంటనే నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, సామాజిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ నిర్మాణ పనులను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.