ఫార్మా-డి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఎల్బీనగర్, జూన్ 6 (స్పెషల్ ఎడిషన్):
ఫార్మా-డి విద్యార్థుల హక్కులు, ఉద్యోగ అవకాశాల కోసం తన పోరాటం కొనసాగుతుందని కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ నాయకుడు ఆంజనేయ చారి స్పష్టం చేశారు. ఫార్మా-డి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మే 29న హస్తినాపురం నుంచి ప్రజాభవన్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించగా, పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే తన ఉద్యమాన్ని అక్కడితో ఆపకుండా జూన్ 5న ప్రజాభవన్‌కు చేరుకుని మాజీ మంత్రి చెన్నారెడ్డికి ఫార్మా-డి విద్యార్థుల సమస్యలపై వినతిపత్రం అందజేశామని తెలిపారు. అనంతరం తెలంగాణ సచివాలయంలో విద్యాశాఖ అధికారులను కలిసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంజనేయ చారి మాట్లాడుతూ, ఫార్మా-డి (డాక్టర్ ఆఫ్ ఫార్మసీ) ఆరు సంవత్సరాల ప్రొఫెషనల్ కోర్సు అని, ఇందులో క్లినికల్ ఫార్మసీ, పేషెంట్ కేర్, డ్రగ్ ఇంటరాక్షన్స్, ఫార్మాకోవిజిలెన్స్, ఐసీయూ రౌండ్స్ వంటి అంశాల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందుతుందని చెప్పారు. ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించే స్థాయికి విద్యార్థులు ఎదుగుతున్నప్పటికీ, చదువు పూర్తయ్యాక తగిన ఉద్యోగ అవకాశాలు లభించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రస్తుతం క్లినికల్ ఫార్మసిస్ట్ పోస్టులు చాలా ఆసుపత్రుల్లో లేకపోవడం, ఉన్నచోట్ల కూడా తక్కువ వేతనాలు ఆఫర్ చేయడం వల్ల విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని తెలిపారు. ఆరు సంవత్సరాలు చదివిన విద్యార్థులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు మాత్రమే జీతాలు ప్రతిపాదించడం అన్యాయమన్నారు. కొన్నిచోట్ల బీ-ఫార్మసీ, ఎంఎస్సీ చదివిన వారికంటే కూడా తక్కువ వేతనాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్లినికల్ ఫార్మసిస్ట్ పోస్టులు చాలా అరుదుగా ఉండటం, ఫార్మాకోవిజిలెన్స్, డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్లలో నియామకాలు జరగకపోవడం ప్రధాన సమస్యలుగా పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఫార్మా-డి సీట్లు, కళాశాలలు పెరుగుతున్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు మాత్రం అదే స్థాయిలో ఉండటంతో పోటీ తీవ్రంగా మారిందన్నారు. ఫార్మా-డి విద్యార్థులు ఆరు సంవత్సరాలు చదివిన తర్వాత కూడా ఉద్యోగాల కోసం తిరగాల్సి రావడం, కుటుంబ సభ్యుల ఒత్తిడి, సమాజంలో పోలికలు, విద్య కోసం తీసుకున్న రుణాల భారం వంటి కారణాలతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఇంటర్న్‌షిప్ సమయంలో ఉచితంగా సేవలు అందించినా, అనంతరం ఉద్యోగ భరోసా లేకపోవడం మరో సమస్యగా మారిందన్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింత పెంపొందించుకోవాలని సూచించారు. ఫార్మాకోవిజిలెన్స్, క్లినికల్ రీసెర్చ్, మెడికల్ రైటింగ్, రెగ్యులేటరీ అఫైర్స్, హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనలిస్ట్, హాస్పిటల్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ వంటి రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పీవీ సర్టిఫికేషన్, క్లినికల్ ఎస్ఏఎస్, మెడికల్ రైటింగ్, ఎన్‌ఏబీహెచ్ వంటి సర్టిఫికేషన్ కోర్సులు విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు. అంతేకాకుండా అమెరికా, కెనడా, మధ్యప్రాచ్య దేశాల్లో కూడా ఫార్మా-డి విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు, కళాశాలలు, సంఘాలు కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్లినికల్ ఫార్మసిస్ట్ పోస్టుల సృష్టికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. “ఫార్మా-డి విద్యార్థుల వద్ద అపారమైన విజ్ఞానం ఉంది. వైద్యులతో సమానంగా రోగుల సంరక్షణలో భాగస్వామ్యం అయ్యే సామర్థ్యం వారికి ఉంది. అయితే వ్యవస్థ నుంచి తగిన గుర్తింపు రావడం లేదు. సరైన నైపుణ్యాలు, సరైన దిశలో ప్రయత్నం ఉంటే ఫార్మా-డి ఒక బంగారు అర్హతగా నిలుస్తుంది” అని ఆంజనేయ చారి పేర్కొన్నారు.