SPECIAL EDITION DAILY
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 8:27 am Posted by : SPECIAL EDITION DAILY

విశ్వకర్మ ఉద్యమం… వేదికలకే పరిమితమా?

-సమాజానికి మాటలు కాదు… మార్పు కావాలి

“ఒక సమాజాన్ని వెనుకబాటుకు నెట్టేది ప్రత్యర్థులు మాత్రమే కాదు… ప్రశ్నించలేని నాయకత్వం కూడా.” ఈ వాక్యం నేడు విశ్వకర్మ సమాజ పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరి మనసులో మెదులుతున్న ప్రశ్న.
రాష్ట్రవ్యాప్తంగా విశ్వకర్మ సంఘాలు, కమిటీలు, సమాఖ్యలు, సేవా సంస్థలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రతి నెలా సభలు… సదస్సులు… సన్మానాలు… తీర్మానాలు… ఐక్యత సమావేశాలు… ఆత్మీయ సమ్మేళనాలు… ఎక్కడ చూసినా ఉద్యమ వాతావరణమే కనిపిస్తోంది. కానీ ఆ ఉద్యమ ఫలితం ఎక్కడ?
వేదికలు పెరిగాయి… కానీ వృత్తులు నిలబడలేదు. నాయకులు పెరిగారు… కానీ నాయకత్వం కనిపించలేదు. నినాదాలు పెరిగాయి… కానీ యువత జీవితాలు మారలేదు. ఇదే చేదు వాస్తవం. ఏళ్ల తరబడి ఒకే మాట. “మనం గొప్పవాళ్లం”, “మన చరిత్ర గొప్పది”, “మన పూర్వీకులు మహానుభావులు”. చరిత్ర గొప్పదే. దాన్ని ఎవరూ కాదనరు. కానీ చరిత్ర చెప్పుకుంటూ వర్తమానాన్ని కోల్పోతే, భవిష్యత్తును ఎవరు నిర్మిస్తారు? నేటి విశ్వకర్మ యువకుడు అడుగుతున్న ప్రశ్నలు వేరే. “పరిశ్రమ ఎలా పెట్టాలి?” “ప్రభుత్వ పథకాలు ఎలా పొందాలి?” “ఎంఎస్‌ఎంఈ నిధులు ఎలా తీసుకోవాలి?” “ఎగుమతులు ఎలా చేయాలి?” “మార్కెట్ ఎలా సంపాదించాలి?” ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన నాయకత్వం… ఇప్పటికీ భావోద్వేగ రాజకీయాలనే విక్రయిస్తే అది సమాజానికి న్యాయం చేసినట్టేనా? కొంతమంది నాయకులు సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, సమస్యలనే రాజకీయ మూలధనంగా మార్చుకుంటున్నారనే విమర్శ సమాజంలో బలపడుతోంది. సమస్యలు ఉంటేనే తమ నాయకత్వానికి విలువ ఉంటుందని భావించే ధోరణి మారకపోతే విశ్వకర్మ ఉద్యమం ముందుకు సాగదు. “విశ్వకర్మ” అనే పదంపై వివాదం వస్తే… వాస్తవాలు చెప్పడం బదులు ఆవేశాన్ని పెంచడం ఎందుకు? రాజ్యాంగం ఏమి చెబుతోంది? చట్ట ప్రక్రియ ఏమిటి? ప్రజలకు స్పష్టత ఇవ్వడం నాయకత్వ బాధ్యత కాదా? ఇంకో ప్రశ్న మరింత బాధాకరం. ప్రతి జిల్లాలో కోట్లాది రూపాయల పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. నైపుణ్యాభివృద్ధి పథకాలు ఉన్నాయి. స్వయం ఉపాధి రుణాలు ఉన్నాయి. మార్కెటింగ్ సహాయం ఉంది. మరి వాటిలో విశ్వకర్మల వాటా ఎంత? ఈ అవకాశాల కోసం ఎన్ని సంఘాలు ఉద్యమించాయి. సభల్లో కనిపించే ఉత్సాహం… జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎందుకు కనిపించడం లేదు? మైక్ ముందు కనిపించే ధైర్యం… ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ఎందుకు కనిపించడం లేదు? ఇది విశ్వకర్మ యువత అడుగుతున్న ప్రశ్న. మరో అంశం మరింత పారదర్శకంగా చర్చకు రావాలి. విశ్వకర్మ సమాజానికి చెందిన కమ్యూనిటీ హాళ్లు, హాస్టళ్లు, ఇతర ఆస్తులు, వాటి నిర్వహణ ఎంత పారదర్శకంగా ఉంది? వాటి ఆదాయం ఎంత? ఆ ఆదాయంలో ఎంత శాతం విద్య, ఉపాధి, శిక్షణ, స్టార్టప్‌ల కోసం వెళుతోంది? సమాజం అడిగితే సమాధానం చెప్పే బాధ్యత ఎవరిది నాయకత్వం అంటే చప్పట్లు కొట్టించుకోవడం కాదు… లెక్కలు చెప్పడం కూడా. ఇక రాజకీయాల విషయానికి వస్తే…
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కావడం తప్పు కాదు. కానీ అది సమాజ సేవకు మార్గం కావాలి. లక్ష్యం కాకూడదు. రాజకీయ పదవులు వచ్చిన తర్వాత కూడా సమాజం అదే స్థితిలో ఉంటే… ఆ పదవుల ప్రయోజనం ఏమిటి? నేడు విశ్వకర్మ సమాజానికి అవసరమైన నినాదం ఒకటే. “పింఛన్లు కాదు… పరిశ్రమలు.” “సంక్షేమం కాదు… స్వావలంబన.” “సబ్సిడీలు కాదు… సుస్థిర ఉపాధి.” ప్రభుత్వాలను కూడా ఈ దిశగానే నిలదీయాలి. “మాకు సాయం చేయండి” అని కాదు… “మాకు అవకాశాలు ఇవ్వండి” అని అడగాలి. నేటి విశ్వకర్మ యువత చేతిలో మొబైల్ ఉంది… సాంకేతిక పరిజ్ఞానం ఉంది… ప్రపంచ మార్కెట్ అందుబాటులో ఉంది. అవసరమైంది దిశ చూపే నాయకత్వం మాత్రమే. భావోద్వేగాలు కాదు, భవిష్యత్తు చూపే నాయకత్వం కావాలి. చివరగా ఒక ప్రశ్న…
విశ్వకర్మ సమాజానికి మరిన్ని సభలు కావాలా? లేక మరిన్ని పరిశ్రమలు కావాలా? మరిన్ని ఉపన్యాసాలు కావాలా? లేక మరిన్ని ఉద్యోగాలు కావాలా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పిన రోజే… విశ్వకర్మ ఉద్యమం వేదికలపై నుంచి వాస్తవ జీవితాల్లోకి అడుగుపెడుతుంది. ఆ రోజు వచ్చినప్పుడే నాయకత్వం గొప్పదని కాదు… సమాజం గెలిచిందని చరిత్ర చెబుతుంది.

యస్.బి.ఎన్ చారి, సంపాదకులు (స్పెషల్ ఎడిషన్)
9440189819