అబ్దుల్లాపూర్ మెట్టు, మే 07 (స్పెషల్ ఎడిషన్):
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిధిలో గడ్డి అన్నారం వ్యవసాయ పండ్ల మార్కెట్ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్‌లో హమాలీల సమస్యలు, రైతులకు విద్యుత్ పథకాలపై అవగాహన కార్యక్రమాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు హమాలీ కార్మికులు కూలీ రేట్ల పెంపు కోసం సిఐటియు ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డికి వినతిపత్రం అందజేయగా, మరోవైపు రైతులకు సౌర విద్యుత్ పథకాలపై అవగాహన కల్పిస్తూ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐటియు రంగారెడ్డి జిల్లా నాయకులు ఏర్పుల నర్సింహ మాట్లాడుతూ బాటసింగారం ఫ్రూట్ మార్కెట్‌లో సుమారు రెండు వేల మంది హమాలీలు కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. నాలుగు సంవత్సరాల క్రితం మాత్రమే హమాలీ రేట్లు పెంచారని, ప్రస్తుతం పెరిగిన ధరలు, జీవన వ్యయం దృష్ట్యా వెంటనే కూలీ రేట్లను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్ల సవరణ చేపట్టే విధంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మార్కెట్‌లో హమాలీల సమస్యలపై అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని, ఇప్పటికే నిర్ణయించిన రేట్లను అమలు చేయాలని కోరారు. తమ డిమాండ్లపై అధికారులు స్పందించకపోతే 14 రోజుల తర్వాత సమ్మె బాట పట్టాల్సి వస్తుందని కార్మిక నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చంద్రమోహన్, వీరన్న, వెంకన్న, ఎల్లయ్య, మసూద్, శంకర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇక ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అబ్దుల్లాపూర్ మెట్టు రైతు వేదికలో “అన్నదాత–విద్యుత్ ప్రదాత” పేరుతో రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్వహించిన ఈ సమావేశానికి గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ క్షేత్రాలు భవిష్యత్తులో సౌర విద్యుత్ కేంద్రాలుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM-KUSUM పథకం ద్వారా రైతులు తమ భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం నుంచి భారీ సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. రైతులు ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ప్రభుత్వానికి విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని, దీని ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రతి పేద కుటుంబం సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. విద్యుత్ అధికారులు ప్రతి గ్రామంలో రైతులకు అందుబాటులో ఉండి పథకాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరాచారి, సర్పంచ్‌లు జక్క రవీందర్ రెడ్డి, కోట ప్రభాకర్ రెడ్డి, అల్లే ఐలయ్య యాదవ్, ఏడీఈ శ్రీనివాస్, ఏఈలు నరేందర్, రాములు, మండల వ్యవసాయ శాఖ అధికారి పల్లవి తదితరులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.