ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ
సూర్యాపేట జిల్లా బ్యూరో, ఆగస్టు14 (స్పెషల్ ఎడిషన్): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల ఆదేశాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు కాప రవికుమార్ నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశభక్తిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి భారతీయుడు జాతీయ పతాకాన్ని గౌరవిస్తూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతనంగా భారతీయ జనతా పార్టీ నూతనకల్ మండల అధ్యక్షుడిగా నియమితులైన కప్పల హనుమంతును మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మాతంగి వెంకన్న, సంజీవరెడ్డి, వార్డు సభ్యులు మసూదన్‌రెడ్డి, సురేందర్‌తో పాటు నాయకులు ఉప్పలయ్య, వెంకటేశ్వర్లు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.