ePaper
Tuesday, September 1, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తోంది: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తోంది: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో, ఆగస్టు 23 (స్పెషల్ ఎడిషన్): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత జి. జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో ఇరు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం ఇప్పుడు తేటతెల్లమైందని అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీతో సంబంధం లేకుండా కన్నేపల్లి పంప్‌హౌస్‌ను ఆన్‌ చేసి నీటిని ఎత్తిపోసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ పలుమార్లు సూచించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని జగదీశ్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం పదేపదే ఎన్‌డీఎస్‌ఏను సాకుగా చూపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. కమిషన్లు, విచారణల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించడంలో విఫలమైందని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీటి తరలింపు జరుగుతున్న తీరును గతంలోనే ప్రజలకు వివరించామని చెప్పారు. పోతిరెడ్డిపాడు ద్వారా వరద జలాలను మాత్రమే తరలించాల్సి ఉండగా, భారీగా నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉందన్నారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం నీటి నిల్వలు ఉన్నప్పటికీ ఎడమ కాల్వ కింద రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. గతంలో 518 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే సాగర్ ఎడమ కాల్వ కింద సాగునీరు అందించామని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 510 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ రైతులకు నీటిని విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం సాగర్‌లో నీరు ఉన్నప్పటికీ రైతులకు ఎందుకు నీరు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ కింద కూడా సాగునీరు అందక దేవరకొండ ప్రాంత రైతులు ధర్నాలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమవుతోందని ఆరోపించారు. నీటిని విడుదల చేస్తే విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తుందని, పంటలు సాగు చేస్తే ఎరువులు అందించాల్సి ఉంటుందని, పండిన పంటను కొనుగోలు చేసి బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కారణాలతోనే ప్రభుత్వం రైతులకు నీరు ఇవ్వడం లేదని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావాన్ని సాకుగా చూపుతూ రైతులకు సాగునీరు ఇవ్వకుండా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారని విమర్శించారు. ఎల్‌నినో రైతులకు వచ్చిన శాపం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే రైతులకు శాపంగా మారాయని అన్నారు. ఎల్‌నినో ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుని రైతులకు సాగునీరు అందించవచ్చని పేర్కొన్నారు. రైతులకు ముందుగానే ఏ పంటలు వేసుకోవాలో, ఏ ప్రాంతంలో ఏ పంటలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ పంట సాగు చేయాలన్నా నీరు అవసరమని, నీటిని ఎప్పుడు, ఎలా అందిస్తారో రైతులకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలవరం, పట్టిసీమ నుంచి పెద్దఎత్తున నీరు తరలిపోతున్నప్పటికీ తెలంగాణలో రైతులకు నీటి కొరత ఏర్పడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కన్నేపల్లి పంపులను సక్రమంగా నడిపి ఉంటే మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ వంటి రిజర్వాయర్లకు నీటిని తరలించే అవకాశం ఉండేదని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పి కన్నేపల్లి పంపులను ఆన్‌ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సాగర్‌లో నీరు ఉన్నా ఎడమ కాల్వ కింద రైతులకు నీరు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే ప్రభుత్వ ఉద్దేశాన్ని బయటపెట్టాయని జగదీశ్‌రెడ్డి అన్నారు. సాగర్‌ నిండిన తర్వాత రైతులకు నీరు ఇవ్వాలని మంత్రి చెప్పడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆరుతడి పంటల విషయంలోనూ ప్రభుత్వం రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ పంటలు సాగు చేయాలి, ఏ విత్తనాలు వాడాలి అనే విషయాలను మంత్రులు స్పష్టంగా చెప్పడం లేదన్నారు. సాగర్‌లో నీటిని అందుబాటులో ఉంచి ఎడమ కాల్వ కింద రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాగర్‌లో నీటి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించాలని వ్యాఖ్యానించారు. భూభారతి అంశంతో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య విభేదాలు మరింత బయటపడుతున్నాయని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోనే పలువురు నాయకులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత సంక్షోభానికి బీఆర్‌ఎస్‌, వైసీపీ కుట్ర కారణమని కొందరు చేస్తున్న ఆరోపణలను ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు ఆ పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాల ఫలితమేనని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా నిషేధిత జాబితాలో కొందరు ఎమ్మెల్యేల భూములు ఉన్నాయని, ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌తో చర్చించి ప్రభుత్వ వైఫల్యాలు, రైతు సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలు, రైతుల సమస్యలపై బీఆర్‌ఎస్‌ మరింత దూకుడుగా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్. భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డి, నోముల భగత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!