ePaper
Wednesday, August 5, 2026
ePaper
HomeతెలంగాణGHMCస్టార్‌కు లక్షలు... శ్రామికుడికి శ్రమేనా?

స్టార్‌కు లక్షలు… శ్రామికుడికి శ్రమేనా?

📰 Generate e-Paper Clip

-రిబ్బన్ కట్‌కు భారీ పారితోషికం… చెమటోడ్చే కార్మికుడికి కనీస హక్కులు కూడా కరువా?

-రోజుకు 12 గంటల పని… వారపు సెలవులు, కార్మిక చట్టాలు అమలవుతున్నాయా? ఉల్లంగనా..?

-ట్రాఫిక్, తొక్కిసలాట, ఫైర్ సేఫ్టీపై ప్రశ్నల నడుమ అట్టహాస ప్రారంభోత్సవం

-కుటుంబ షాపింగ్ మాల్ పక్కనే వైన్ షాపులు… మహిళల భద్రతపై ఆందోళనలు

-స్టార్ గ్లామర్ వెనుక శ్రామికుల చెమటను మరుగున పడేస్తున్నారా అంటూ విమర్శలు

ఉప్పల్ జోన్, జులై 17 (స్పెషల్ ఎడిషన్): ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోడుప్పల్‌లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఆర్‌ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కంటే, దాని చుట్టూ నెలకొన్న వివాదాలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కోట్ల రూపాయల వ్యాపారం చేసే సంస్థలు ప్రారంభోత్సవానికి సినీ హీరోలకు భారీ మొత్తాలు చెల్లించగలిగితే, అదే సంస్థలో శ్రమించే ఉద్యోగులకు చట్టబద్ధమైన పని గంటలు, వారపు సెలవులు, కనీస కార్మిక హక్కులు ఎందుకు కల్పించడం లేదనే ప్రశ్నలు సామాజిక వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ప్రారంభోత్సవానికి సినీ హీరో నాగచైతన్య హాజరవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే రిబ్బన్ కట్‌కు లక్షలు వెచ్చించే యాజమాన్యం, ప్రతిరోజూ చెమటోడ్చే కార్మికుడి సంక్షేమంపై అదే స్థాయిలో శ్రద్ధ చూపుతోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రోజుకు 12 గంటల పని, వారపు సెలవులపై సందేహాలు, అదనపు పని భత్యాలపై ఆరోపణలు, కార్మిక సంక్షేమ నిబంధనల అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కార్మిక శాఖ, కార్మిక శాఖ మంత్రి తక్షణమే తనిఖీలు చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. “ఒక్కరోజు అతిథిగా వచ్చేవారికి లక్షలు… నెలంతా శ్రమించే కార్మికుడికి మాత్రం వేల రూపాయలేనా?” అంటూ సామాజికవేత్తలు, దళిత సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. సంస్థ ప్రతిష్ఠ కోసం స్టార్‌లను ఆహ్వానించడం తప్పు కాకపోయినా, అదే ఉత్సాహం కార్మికుల సంక్షేమం, భద్రత, గౌరవప్రదమైన ఉద్యోగ వాతావరణం కల్పించడంలో ఎందుకు కనిపించడం లేదని నిలదీస్తున్నారు. ఇప్పటికే ఉప్పల్ ప్రధాన రహదారిపై నిర్మాణ పనులు కొనసాగుతున్న వేళ వేలాది మంది ఒకేసారి తరలివస్తే ట్రాఫిక్ స్తంభించే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనలు ఇంకా ప్రజల మదిలో నుంచి చెరిగిపోలేదని, ఈసారి కూడా ముందస్తు జాగ్రత్తలు ఎంత మేర తీసుకున్నారనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు భవనంలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పూర్తిగా పాటించారా? అత్యవసర పరిస్థితుల్లో బయటపడేందుకు తగిన సెట్‌బ్యాక్‌లు ఉన్నాయా? అగ్నిమాపక వాహనాలు అన్ని వైపుల నుంచి చేరుకునే అవకాశం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభోత్సవానికి అనుమతులు ఇచ్చే ముందు సంబంధిత శాఖలు అన్ని నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించాయా లేదా అన్నది కూడా స్పష్టత రావాల్సి ఉందని స్థానికులు అంటున్నారు. కుటుంబ సమేతంగా వచ్చే వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకున్న మాల్‌కు సమీపంలో వైన్ షాపులు ఉండడం కూడా విమర్శలకు దారితీసింది. మహిళా ఉద్యోగులు, మహిళా వినియోగదారుల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. “స్టార్‌ల మెరుపులు ఒకరోజే… శ్రామికుడి చెమట ప్రతిరోజూ. ప్రారంభోత్సవానికి ఖర్చు చేసే ప్రతి రూపాయికీ విలువ ఉన్నట్లే, కార్మికుడి శ్రమకూ విలువ ఉండాలి” అని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మిక శాఖ, ఫైర్ శాఖ, మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సమగ్రంగా తనిఖీలు నిర్వహించి అన్ని నిబంధనలు పాటిస్తున్నారో లేదో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని స్థానికులు, మేధావులు కార్మిక సంఘాలు కోరుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!