ePaper
Tuesday, September 1, 2026
ePaper
Homeతెలంగాణకెమెరా కన్ను.. ఓటు తీర్పు.. గెలుపు పిలుపు

కెమెరా కన్ను.. ఓటు తీర్పు.. గెలుపు పిలుపు

📰 Generate e-Paper Clip

-వనస్థలిపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గుడి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా సాయి వర్మ, కోశాధికారిగా జెల్లా శ్రీనివాస్ విజయం

-93 శాతం పోలింగ్‌తో సభ్యుల చైతన్యానికి అద్దం పట్టిన ఎన్నికలు

-ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ

-పోటీ ముగిసింది.. ఇక విభేదాలకు తావులేదు.. అసోసియేషన్ అభివృద్ధే అందరి లక్ష్యం: ఎలక్షన్ కమిటీ

-గెలిచింది వ్యక్తులు కాదు.. అసోసియేషన్, ఐక్యత, ప్రజాస్వామ్య స్ఫూర్తి!

వనస్థలిపురం, ఆగస్టు 08 (స్పెషల్ ఎడిషన్): వనస్థలిపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (రి.నం.1250/2015) 2026–2028 కార్యవర్గ ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి, సభ్యుల ఐక్యతకు, చైతన్యానికి ప్రతీకగా నిలిచాయి. ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. వనస్థలిపురం క్రాంతి హిల్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో సభ్యులు 148కి గాను 137 మంది పాల్గొని తమ ఓటు హక్కును బ్యాలెట్ ఓటు విధానం ద్వారా  వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం అధ్యక్షుడిగా గుడి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా మాదాసు సాయివర్మ, కోశాధికారిగా జెల్లా శ్రీనివాస్ విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా నరసింహరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలతో నూతన కార్యవర్గం కొలువుదీరగా, అసోసియేషన్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఎన్నికల వరకు ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నప్పటికీ.. ఫలితాలు వెలువడిన వెంటనే అందరూ ఒక్కటిగా నిలవడం అసోసియేషన్ ఎన్నికల ప్రత్యేకతగా నిలిచింది.

93 శాతం పోలింగ్.. సభ్యుల చైతన్యానికి నిదర్శనం

“నా ఓటు-నా హక్కు.. నా ఓటు-నా బాధ్యత” అనే ప్రజాస్వామ్య స్ఫూర్తితో సభ్యులు భారీగా ప్రత్యక్షంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. 93 శాతం ఓటింగ్ నమోదు కావడం అసోసియేషన్ సభ్యుల్లో ఉన్న చైతన్యానికి, తమ సంఘం భవిష్యత్తుపై వారికున్న బాధ్యతకు నిదర్శనమని ఎలక్షన్ కమిటీ పేర్కొంది. ఎన్నికల్లో ఓటు వేయడం కేవలం ఒక హక్కు మాత్రమే కాదని.. అది సభ్యుల బాధ్యత కూడా అని కమిటీ స్పష్టం చేసింది. ఒక ఓటు ఒక అభ్యర్థి భవిష్యత్తును మాత్రమే కాదు.. మొత్తం అసోసియేషన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని సభ్యులు ఈ ఎన్నికల ద్వారా నిరూపించారని తెలిపింది. దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సభ్యులు, ముఖ్యంగా మహిళా సభ్యులు చూపిన ఉత్సాహం అభినందనీయమని కమిటీ పేర్కొంది. తిరుపతి నుంచి ప్రత్యేకంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళా ఓటరు చొరవ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచిందని తెలిపింది.

ఎన్నికలు ప్రశాంతంగా.. పారదర్శకంగా

ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశను ఎలక్షన్ కమిటీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించింది. పోలింగ్ కేంద్రంలో క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ, సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. పోలింగ్ కేంద్రంలో క్రమశిక్షణ పాటించడం, గుర్తింపు కార్డులతో హాజరు కావడం, ప్రచార నిబంధనలను గౌరవించడం వంటి అంశాల్లో సభ్యులు చూపిన సహకారం ఎన్నికలను విజయవంతం చేయడంలో కీలకమైందని కమిటీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియను ఎలాంటి పక్షపాతం లేకుండా, ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పిస్తూ నిర్వహించామని ఎలక్షన్ కమిటీ స్పష్టం చేసింది.

లెక్కింపు సమయంలో ఉత్కంఠ

ఓట్ల లెక్కింపు ప్రారంభమైన సమయంలో పోలింగ్ కేంద్రంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ప్రతి ఓటు ఎంతో కీలకంగా మారడంతో అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. చివరి ఓటు లెక్కింపు పూర్తయ్యే వరకు ఎవరి విజయం ఖరారవుతుందోనన్న ఉత్కంఠ కొనసాగింది. చివరకు ఫలితాలు వెలువడటంతో అధ్యక్షుడిగా గుడి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా సాయి వర్మ, కోశాధికారిగా జెల్లా శ్రీనివాస్ విజయం సాధించారు. అయితే ఫలితాలు ప్రకటించిన అనంతరం పోటీ చేసిన అభ్యర్థులు పరస్పరం అభినందించుకోవడం ఎన్నికలలో అత్యంత సానుకూల పరిణామంగా నిలిచింది. “ఎన్నికల వరకు పోటీ.. ఫలితాల తర్వాత ఐక్యత” అనే సందేశాన్ని సభ్యులు స్పష్టంగా చాటిచెప్పారు. గెలుపు ఎవరిదైనా.. గెలిచింది అసోసియేషనే! ఎన్నికల ఫలితాలను వ్యక్తిగత గెలుపు-ఓటమిగా చూడకూడదని ఎలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. “గెలిచింది ఎవరు? ఓడింది ఎవరు? అనే ప్రశ్నలకు ఇప్పుడు ప్రాధాన్యత లేదు. ఎన్నికల పోటీ ముగిసింది. ఇక గెలిచింది మన అసోసియేషన్.. గెలిచింది మన ఐక్యత.. గెలిచింది ప్రజాస్వామ్య స్ఫూర్తి” అని కమిటీ పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి అసోసియేషన్ సభ్యుడేనని, ఎన్నికల తర్వాత అందరూ సమానమేనని తెలిపింది. గెలిచిన అభ్యర్థులు విజయం ద్వారా బాధ్యతను పొందారని, ఓడిన అభ్యర్థులు కూడా తమ అనుభవం, ఆలోచనలు, సూచనలతో అసోసియేషన్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.

‘మన అసోసియేషన్-మన అభివృద్ధి’

ఈ ఎన్నికలు కేవలం పదవుల కోసం జరిగిన పోటీగా కాకుండా “మన అసోసియేషన్-మన అభివృద్ధి” అనే ఆలోచనకు వేదికగా మారాయని ఎలక్షన్ కమిటీ పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు తమ తమ ఆలోచనలు సభ్యుల ముందుంచడం ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చిందని తెలిపింది. వ్యక్తిగత విమర్శలు, పరస్పర విభేదాలకు దూరంగా ఉండి సానుకూల అంశాలపై దృష్టి సారించడం అభినందనీయమని పేర్కొంది. ఇకపై కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కమిటీ సూచించింది.

ఇక రాజకీయాలు కాదు.. సంక్షేమమే అజెండా

ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా రాజకీయ వాతావరణాన్ని కొనసాగించడం అసోసియేషన్‌కు ఏమాత్రం మంచిది కాదని ఎలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. “ఎన్నికలు ముగిశాయి.. ప్రచారం ముగిసింది.. పోటీ ముగిసింది.. ఇకపై ఎవరు ఏ ప్యానల్‌లో ఉన్నారు అనే ప్రశ్నకు తావులేదు. ఇప్పుడు మనందరి ముందున్న ఏకైక ప్రశ్న… అసోసియేషన్‌ను ఎలా బలోపేతం చేయాలి? సభ్యుల సమస్యలను ఎలా పరిష్కరించాలి?” అని కమిటీ సూచించింది. సభ్యుల మధ్య ఎన్నికల కారణంగా ఏర్పడిన చిన్నచిన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి, అందరూ ఒకే కుటుంబంగా ముందుకు సాగాలని కోరింది.

నూతన కార్యవర్గానికి కీలక సూచనలు

నూతన కార్యవర్గం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కార్యాచరణలోకి తీసుకురావాలని ఎలక్షన్ కమిటీ సూచించింది. సభ్యుల సమస్యలను తెలుసుకునేందుకు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని, ప్రతి సభ్యుడికి అందుబాటులో ఉండే విధంగా కార్యవర్గం పనిచేయాలని సూచించింది. ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల వృత్తికి సంబంధించిన సమస్యలు, వృత్తిపరమైన ఇబ్బందులు, సంక్షేమ పథకాలు, సభ్యత్వ సమస్యలు, ఆరోగ్య-బీమా వంటి సంక్షేమ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొంది. అసోసియేషన్‌కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం, సభ్యులకు సమాచారం అనే మూడు అంశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అసోసియేషన్ నిధులు సభ్యుల సంక్షేమానికే వినియోగించబడేలా స్పష్టమైన విధానాలు రూపొందించాలని, ముఖ్యమైన నిర్ణయాల్లో సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది.

మాటలు కాదు.. పనితీరే ప్రమాణం

నూతన కార్యవర్గం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాటలకే పరిమితం చేయకుండా కార్యరూపంలో చూపించాలని ఎలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. “సభ్యులు మీపై ఉంచిన నమ్మకమే మీకు లభించిన అసలైన విజయం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే మీ ముందున్న అసలైన పరీక్ష” అని పేర్కొంది. పదవులు గౌరవం కోసం మాత్రమే కాకుండా బాధ్యత కోసం అని గుర్తుంచుకోవాలని సూచించింది. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షుడు మాత్రమే కాకుండా ప్రతి గౌరవ సభ్యుడు సంఘం కోసం సమష్టిగా పనిచేయాలని కోరింది.

ఓడిన అభ్యర్థులు కూడా అసోసియేషన్‌కు ఆస్తే

ఎన్నికల్లో విజయం సాధించని అభ్యర్థులను పక్కన పెట్టకూడదని ఎలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. వారికి కూడా కార్యవర్గ ప్రతిపక్ష సభ్యులుగా సమాన గౌరవం, సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, వారి అనుభవం, సూచనలు, ఆలోచనలను అసోసియేషన్ అభివృద్ధికి వినియోగించుకోవాలని నూతన కార్యవర్గానికి సూచించింది. “ఓడిన అభ్యర్థి ఓడిపోయిన వ్యక్తి కాదు.. అసోసియేషన్ కోసం ఆలోచించే మరో గొంతు” అనే భావనతో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించింది.

వ్యక్తిగత విభేదాలకు తావులేదు

ఎన్నికల సమయంలో జరిగిన మాటామాటలు, అభిప్రాయ భేదాలు, పోటీ వాతావరణాన్ని ఎన్నికలతోనే ముగించాలని ఎలక్షన్ కమిటీ స్పష్టం చేసింది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు లేదా వ్యక్తిగత వేదికల ద్వారా పరస్పరం విమర్శించుకోవడం, పాత విషయాలను మళ్లీ తెరపైకి తీసుకురావడం, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం వంటి వాటికి సభ్యులు దూరంగా ఉండాలని సూచించింది. అసోసియేషన్ పేరు, ప్రతిష్ట ప్రతి సభ్యుడి బాధ్యత అని గుర్తుంచుకోవాలని తెలిపింది.

సభ్యులే అసోసియేషన్‌కు బలం

ఒక కార్యవర్గం మాత్రమే అసోసియేషన్‌ను అభివృద్ధి చేయలేదని.. ప్రతి సభ్యుడి సహకారం, సూచన, భాగస్వామ్యంతోనే సంఘం బలపడుతుందని ఎలక్షన్ కమిటీ పేర్కొంది. సభ్యులు కూడా నూతన కార్యవర్గానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని, తప్పులను ఎత్తిచూపడంతో పాటు పరిష్కార మార్గాలను కూడా సూచించాలని కోరింది. విమర్శ కోసం విమర్శ కాకుండా.. అభివృద్ధి కోసం సూచన అనే విధానాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించింది.

నూతన కార్యవర్గానికి అభినందనలు

అధ్యక్షుడిగా గుడి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా సాయి వర్మ, కోశాధికారిగా జెల్లా శ్రీనివాస్ విజయం సాధించడంతో పాటు ఉపాధ్యక్షుడిగా నరసింహరాజు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై ఎలక్షన్ కమిటీ అభినందనలు తెలిపింది. అదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థిని అభినందిస్తూ, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములైనందుకు కృతజ్ఞతలు తెలిపింది. పోలింగ్‌లో పాల్గొన్న ప్రతి ఓటరుకు, ఎన్నికల నిర్వహణకు సహకరించిన ప్రతి సభ్యుడికి, అభ్యర్థులకు అండగా నిలిచిన మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఎలక్షన్ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

“ఎన్నికలతో పోటీ ముగిసింది.. బాధ్యత ప్రారంభమైంది”

ఎలక్షన్ కమిటీ సభ్యులు జిల్లెల సోమిరెడ్డి, అనంతరెడ్డి, ఎస్.బి.ఎన్. చారి మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. “ఎన్నికల వరకు ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మనమంతా ఒక్కటే. గెలిచినవారు బాధ్యత తీసుకోవాలి. పోటీ చేసినవారు నిర్మాణాత్మక సహకారం అందించాలి. సభ్యులు సంఘం అభివృద్ధికి అండగా నిలవాలి. వ్యక్తిగత ప్రయోజనాల కంటే సంఘ ప్రయోజనాలే ముందుండాలి” అని సూచించారు. “ఎన్నికలతో పోటీ ముగిసింది.. ఇక బాధ్యత ప్రారంభమైంది. మన వృత్తి బలపడాలి.. మన సభ్యుల సంక్షేమం మెరుగుపడాలి.. మన అసోసియేషన్ మరింత బలోపేతం కావాలి.. వనస్థలిపురం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మరింత ఉన్నతంగా నిలవాలి” అని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సభ్యులందరికీ భోజన సదుపాయం ఏర్పాటుచేసిన నక్క శ్రీనివాస్ యాదవ్ కి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నక్క శ్రీనివాస్ యాదవ్ ఎలక్షన్ కమిటీ సభ్యులను, కార్యవర్గ సభ్యులను సత్కరించి మిఠాయిలతో నోరును తీపి చేయడం ఎలక్షన్ కమిటీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్స్ సత్య గంగదారి, శ్రీధర్, సీలం రామిరెడ్డిలతో పాటు మహిళా వీడియో ఎడిటర్స్ , ఆల్బమ్ డిజైనర్స్, ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.

చివరగా ఎలక్షన్ కమిటీ సభ్యులు ఇచ్చిన సందేశం ఒక్కటే…

“పదవి కోసం పోటీ పడటం ప్రజాస్వామ్యం.. పదవి వచ్చిన తర్వాత అందరి కోసం పనిచేయడం నాయకత్వం.. ఎన్నికల తర్వాత కూడా అందరినీ కలుపుకొని నడవడం నిజమైన ఐక్యత.” అని ముక్తకంఠంతో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!