ePaper
Tuesday, September 1, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్మైనర్లే టార్గెట్!

మైనర్లే టార్గెట్!

📰 Generate e-Paper Clip

వనస్థలిపురంలో వారాహి సిల్వర్ జువెలరీ ప్రచారంపై తీవ్ర ఆరోపణలు

పేద పిల్లలతో ప్రచారమా? రూ.300కే బాల కార్మికుల వినియోగమా?

పశువుల్లాగా గల్లి గల్లి తిప్పుతూ పబ్లిసిటీని పెంచుకుంటున్న వారాహీ

పిల్లలను రోడ్లపైకి తీసుకురావడంపై అభ్యంతరాలు

అనుమతులు, కార్మిక చట్టాలు, హోర్డింగులపై అధికారుల తనిఖీలు ఎప్పుడు?

వనస్థలిపురం, ఆగస్టు 18 (స్పెషల్ ఎడిషన్):

వనస్థలిపురం పనామా గోడౌన్ చౌరస్తాలో ఈ నెల 22న ఆరో బ్రాంచ్ ప్రారంభానికి సిద్ధమవుతున్న వారాహి సిల్వర్ జువెలరీ ప్రచార కార్యక్రమాలపై స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార ప్రచారం కోసం పెద్ద సంఖ్యలో మైనర్ బాలలను వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పేద, బడుగు వర్గాలకు చెందిన పిల్లలను గుర్తించి ప్రచార కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రూ.300కే బాలల వినియోగమా?

ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే పిల్లలకు కేవలం రూ.300 వరకు చెల్లిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. డబ్బులు ఇచ్చి చిన్నారులను వ్యాపార ప్రచారానికి వినియోగించడం చట్టబద్ధమేనా? పిల్లల వయస్సు, వారి విద్య, పని సమయం, తల్లిదండ్రుల అనుమతి వంటి అంశాలను పరిశీలించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజంగా మైనర్లను వాణిజ్య ప్రచారంలో ఉపయోగిస్తుంటే సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

రోడ్లపై పిల్లల తోపుడు బండ్లు .. పబ్లిక్ న్యూసెన్సా?

భారీ సంఖ్యలో తోపుడుబండ్లను బ్యాండ్ మేళం ను ఒకేసారి రోడ్లపైకి తీసుకువచ్చి ప్రచారం నిర్వహించడం వల్ల, స్థానిక కాలనీవాసులకు సౌండ్ పొల్యూషన్, వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్నారా? భద్రతా చర్యలు చేపట్టారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని వారు కోరుతున్నారు. అనుమతులు లేకుండా లేదా ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో ప్రచారం నిర్వహిస్తే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కార్మిక చట్టాలు పాటిస్తున్నారా?

వారాహి సిల్వర్ జువెలరీలో సిబ్బంది నియామకాలు, వేతనాలు, పని గంటలు, భద్రతా ప్రమాణాలు తదితర అంశాల్లో కార్మిక చట్టాలు పాటిస్తున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సంస్థలో ఉద్యోగుల నియామకాలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే సమాచారం తమకు అందిందని కొందరు స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఇవి ప్రస్తుతం ఆరోపణల స్థాయిలోనే ఉన్నందున సంబంధిత కార్మిక శాఖ అధికారులు సమగ్ర తనిఖీ నిర్వహించి నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది.

హోర్డింగులు.. అనుమతుల సంగతేంటి?

బ్రాంచ్ ప్రారంభోత్సవ ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగులు, బ్యానర్లు, ఇతర ప్రకటనల విషయంలో మున్సిపల్ నిబంధనలు పాటిస్తున్నారా? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అవసరమైన అనుమతులు తీసుకోకుండా ప్రకటనలు ఏర్పాటు చేస్తే మున్సిపల్ ఆదాయానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అనుమతులు, పరిమాణం, ఏర్పాటు చేసిన ప్రదేశం, ఫీజుల చెల్లింపు తదితర అంశాలపై మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని కోరుతున్నారు.

మైనర్లను ప్రచారానికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, అనుమతులపై సందేహాలు, కార్మిక చట్టాల అమలుపై ప్రశ్నలు, హోర్డింగుల వ్యవహారం-ఇలా పలు అంశాలు ఒకేసారి తెరపైకి రావడంతో సంబంధిత శాఖల సమన్వయంతో సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆరోపణల్లో వాస్తవమెంత? నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నారు? అన్నది అధికారుల తనిఖీలతోనే తేలాల్సి ఉంది.

అధికారుల స్పందన కోసం ఎదురుచూపులు
ఈ ఆరోపణలపై వారాహి సిల్వర్ జువెలరీ యాజమాన్యం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే కార్మిక శాఖ, మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయా లేదా అన్నది స్పష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!