ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeతెలంగాణడాక్టర్ కలకు రూ.లక్ష చేయూత

డాక్టర్ కలకు రూ.లక్ష చేయూత

📰 Generate e-Paper Clip

రష్యాలో ఎంబీబీఎస్ చదువుతున్న శ్రీలలితకు రూ.లక్ష ఆర్థిక సాయం
తండ్రి మృతితో నిలిచిపోయే దశలో వైద్య విద్యకు భరోసా
విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా ఏసీపీ కిరణ్ కుమార్ చేయూత
కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్న మానవతామూర్తి
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (స్పెషల్ ఎడిషన్):
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని చాటుతూ ఏసీపీ కిరణ్ కుమార్ మరోసారి తన సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ కుటుంబానికి చెందిన రష్యాలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీలలిత వైద్య విద్యను కొనసాగించేందుకు విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీలలిత తండ్రి చిన్న కుటీర పరిశ్రమను అప్పులు చేసి నిర్వహించేవారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆ పరిశ్రమ మూతపడటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అప్పులు పెరగడంతో కనీస అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారిన పరిస్థితుల్లో, సుమారు రెండు నెలల క్రితం కుటుంబ పెద్ద మృతి చెందడంతో పరిస్థితి మరింత విషమించింది. ఈ నేపథ్యంలో రష్యాలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీలలిత విద్యాభ్యాసం కూడా అర్ధంతరంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మరో ఏడాది చదువు పూర్తి చేస్తే వైద్యురాలిగా నిలబడి తన తల్లితో పాటు కుటుంబానికి అండగా నిలుస్తుందనే ఆశతో ఉన్న కుటుంబ సభ్యులు, ఆర్థిక సాయం కోసం ఏసీపీ కిరణ్ కుమార్‌ను ఆశ్రయించారు. వారి పరిస్థితిని తెలుసుకున్న కిరణ్ కుమార్ కుటుంబ సభ్యుల బాధను తన సొంత సమస్యగా భావించి వెంటనే స్పందించారు. విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ ద్వారా శ్రీలలిత ఫైనల్ ఇయర్ వైద్య విద్య కోసం రూ.1 లక్ష చెక్కును అందజేశారు. ఫౌండేషన్ రిజిస్టర్డ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చెక్కును స్వయంగా అందజేసి, శ్రీలలిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. పోలీస్ అధికారిగా శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఏసీపీ కిరణ్ కుమార్ ముందుంటున్నారని పలువురు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరమయ్యే పరిస్థితిలో ఉన్న విద్యార్థులకు చేయూత అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు.
శ్రీలలిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తండ్రి మరణంతో తమ కూతురి వైద్య విద్య నిలిచిపోతుందేమోనని తీవ్ర ఆందోళన చెందుతున్న సమయంలో కిరణ్ కుమార్ అందించిన ఆర్థిక సాయం తమకు కొండంత అండగా నిలిచిందని భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో స్పందించిన ఏసీపీ కిరణ్ కుమార్‌కు, విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్ సభ్యులకు జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. “మా పాప డాక్టర్ కావాలనే కలకు ఈ సాయం కొత్త ఊపిరినిచ్చింది. ఆమె చదువు పూర్తి చేసి వైద్యురాలిగా నిలబడటమే తమ కుటుంబం తరఫున కిరణ్ కుమార్‌కు ఇచ్చే గొప్ప కృతజ్ఞత” అని శ్రీలలిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. వైద్యురాలిగా శ్రీలలిత తన లక్ష్యాన్ని చేరుకుని కుటుంబానికి, సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తూ ఏసీపీ కిరణ్ కుమార్ అందించిన ఈ చేయూత ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!