-హయత్‌నగర్ పోలీసుల దర్యాప్తుతో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
-మైనర్ బాలికపై లైంగిక దుర్వినియోగం కేసులో కోర్టు తీర్పు
-రూ.6 వేల జరిమానా, బాధితురాలికి రూ.లక్ష పరిహారం
-పటిష్టమైన సాక్ష్యాధారాలతో నేరం రుజువు
-చిన్నారులపై నేరాలకు కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
హయత్‌నగర్, జూన్ 08 (స్పెషల్ ఎడిషన్):
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్‌లోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. మైనర్ బాలికను మోసపూరితంగా నమ్మించి లైంగికంగా దుర్వినియోగం చేసినట్లు విచారణలో రుజువు కావడంతో కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించింది. పోలీసుల వివరాల ప్రకారం, మేఘావత్ శ్రీకాంత్ అనే వ్యక్తిపై హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం.638/2019 కింద ఐపీసీ సెక్షన్లు 417, 376తో పాటు పోక్సో చట్టం సెక్షన్–4 ప్రకారం కేసు నమోదు చేశారు. దర్యాప్తు సమయంలో సేకరించిన సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలు, బాధితురాలి వాంగ్మూలం, ఇతర కీలక ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం నిందితుడి నేరం రుజువైందని తేల్చి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6,000 జరిమానా విధించింది. అదేవిధంగా బాధితురాలికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో బాధిత పరిహారం పథకం కింద రూ.1,00,000 ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలిచిందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కేసును అప్పటి హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ కె. సతీష్ కుమార్ సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడిపై పటిష్టమైన సాక్ష్యాధారాలను సేకరించారు. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. కేసు విచారణలో ప్రభుత్వ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బి. సునీత, పి. సత్యనారాయణ సమర్థవంతంగా వాదనలు వినిపించి నిందితుడికి శిక్ష పడేలా కీలక పాత్ర పోషించారు. కోర్టు డ్యూటీ అధికారులు, సమన్ల అధికారులు, లైజన్ అధికారులు, మానిటరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి కేసు విజయవంతమైన తీర్పుకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా హయత్‌నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి. నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యతతో వ్యవహరిస్తోందన్నారు. ముఖ్యంగా పోక్సో కేసుల్లో నిందితులను చట్టపరంగా శిక్షించే దిశగా దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ విభాగం, కోర్టు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
