“కష్టపడింది ప్రజలు.. క్రెడిట్ కొట్టేది మీరు.. ఇక ఆ నాటకాలు సాగవు”
– భాజపా సీనియర్ నాయకులు కాసోజు శంకరాచారి ఘాటు విమర్శలు
నేరడ/చిట్యాల, జూన్ 15 (స్పెషల్ ఎడిషన్):
నేరడ–గాదిరెడ్డిపల్లె అనుసంధాన వంతెన అంశాన్ని కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రచారానికి, రాజకీయ మనుగడకు వేదికగా మార్చుకోవడం దురదృష్టకరమని భాజపా సీనియర్ నాయకులు కాసోజు శంకరాచారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “రెండు సంవత్సరాల క్రితమే అధికారులు, శాఖలను సంప్రదించామని గొప్పలు చెప్పుకునే వారు నిజంగా అంత చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఈరోజు గ్రామ ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ముందుగా సమాధానం చెప్పాలి” అని ప్రశ్నించారు. అధికారులకు అర్జీలు ఇచ్చామని చెప్పుకోవడం ఒకటి, ప్రజల సమస్య పరిష్కారం కోసం నిరంతరం పోరాడటం మరోటి అని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు కనిపించని వారు, ఉద్యమం ఫలితాలు కనిపించడం ప్రారంభమైన తర్వాత ముందుకు వచ్చి మొత్తం క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. గత కొన్ని సంవత్సరాలుగా రైతులు సాగునీటి సమస్యలతో, రాకపోకల ఇబ్బందులతో తీవ్రంగా నష్టపోతుంటే వారిని పట్టించుకోని వారు ఇప్పుడు గ్రామాభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రైతుల కష్టాలపై పైశాచిక ఆనందం పొందిన వారే ఇప్పుడు ప్రజా సేవకులమంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. “రూపాయి పని చేసి వంద రూపాయల ప్రచారం చేసుకునే సంస్కృతికి మీదని అది మానుకుంటే మంచిదని కితాబు పలికారు. ప్రజల కోసం పోరాడి ఫలితాలు సాధించడం మాకు తెలుసు. కానీ కొందరికి సోషల్ మీడియా పోస్టులు, తప్పుడు ప్రకటనలు, స్వప్రచారమే ప్రజాసేవగా కనిపిస్తోంది” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. గ్రామ ప్రజలు బ్రిడ్జి కోసం రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తే వారిపై కేసులు పెట్టించడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించడం, ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం ఎవరి చరిత్రలో ఉందో గ్రామ ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఇప్పుడు అదే ప్రజలు ఏకమై బ్రిడ్జి కోసం పోరాడుతుంటే తట్టుకోలేక అసత్య ప్రచారాలకు దిగడం వారి రాజకీయ దౌర్భాగ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ వారం రోజులుగా గ్రామ ప్రజలు, మహిళలు, రైతులతో కలిసి చేపట్టిన ఉద్యమాలు, ధర్నాలు, అధికారులతో వరుస సమావేశాల వల్లే వంతెన నిర్మాణ అంశం ప్రభుత్వ దృష్టికి వెళ్లిందని స్పష్టం చేశారు. ప్రజల పోరాటాన్ని చూసి భయపడిన కొందరు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు కథనాలు అల్లుతున్నారని ఆరోపించారు. “ప్రజలు అమాయకులు కారు. ఎవరు కష్టపడ్డారు, ఎవరు కేవలం ఫోటోలు దిగారు, ఎవరు పోరాడారు, ఎవరు క్రెడిట్ కోసం పరుగులు తీశారు అన్నది గ్రామస్తులకు స్పష్టంగా తెలుసు” అని అన్నారు. తమపై ఆరోపణలు చేసే వారు ముందుగా గ్రామానికి చేసిన సేవలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. “ప్రజా సమస్యలపై ఎప్పుడైనా ఉద్యమం చేశారా? రైతుల కోసం ఎప్పుడైనా నిలబడ్డారా? గ్రామ ప్రజలతో కలిసి ఒక్కరోజైనా పోరాటం చేశారా?” అని ప్రశ్నించారు. వంతెన కోసం జరుగుతున్న పోరాటం ఏ వ్యక్తి సొత్తు కాదని, ఇది ప్రజల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమమని అన్నారు. ప్రజల ఆకాంక్షలను అడ్డుపెట్టుకుని స్వప్రచారం చేసుకునే రాజకీయ అవకాశవాదులను గ్రామ ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు. “మాకు పదవులు అవసరం లేదు.. ప్రచారం అవసరం లేదు.. గ్రామానికి వంతెన కావాలి, రైతులకు న్యాయం జరగాలి, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. అదే మా లక్ష్యం. ఇకనైనా అబద్ధపు ప్రచారాలు మానేసి ప్రజల కోసం పనిచేయడం నేర్చుకోండి” అని కాసోజు శంకరాచారి స్పష్టం చేశారు.
