
-పంచెకట్టులో మోదీ విజయోత్సవ సభలో ప్రత్యేక ఆకర్షణ
-బెంగాల్ ఫలితాలతో శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి
-భయం, హింస నుంచి బెంగాల్ విముక్తి పొందిందని వ్యాఖ్య
-ఈసారి శాంతియుతంగా జరిగిన పోలింగ్‌పై ప్రధాని ప్రశంసలు
-కాంగ్రెస్‌పై ‘అర్బన్ నక్సల్స్’ అంటూ ఘాటు విమర్శలు
-మహిళా ఓటర్ల తీర్పే పార్టీల భవిష్యత్తు అని స్పష్టం
-గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ ఆధిపత్యం
-తూర్పు భారత అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాధ్యం
స్పెషల్ కరస్పాండెంట్, మే 04; (స్పెషల్ ఎడిషన్):
పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన విజయోత్సవ సభలో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పంచెకట్టులో హాజరైన మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, తన వేషధారణతో పాటు ప్రసంగ శైలితో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. బెంగాల్‌లో పార్టీకి లభించిన ఈ చారిత్రక విజయాన్ని ఆయన భావోద్వేగంగా దేశ ఐక్యత కోసం పోరాడిన జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీకి అంకితం చేశారు. “దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఆయన చేసిన త్యాగాలు అపారమైనవి. ఈ రోజు వచ్చిన ఫలితాలు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చి ఉంటాయి” అని మోదీ అన్నారు. దేశం కోసం జీవించాలి, దేశం కోసం మరణించాలి అనే సందేశాన్ని కార్యకర్తలకు అందించిన మహానేతగా ఆయనను కొనియాడారు.
- బెంగాల్ రాజకీయాల్లో జరిగిన ఈ మార్పును ప్రజాస్వామ్య విజయం అని అభివర్ణించిన మోదీ, గతంలో ఎన్నికల సమయంలో అక్కడ హింసాత్మక ఘటనలు, భయానక వాతావరణం, ప్రాణనష్టం వంటి పరిస్థితులు నెలకొనేవని గుర్తు చేశారు. అయితే ఈసారి ప్రశాంతంగా, శాంతియుతంగా పోలింగ్ జరగడం ఎంతో గొప్ప పరిణామమని పేర్కొన్నారు. “ప్రజాస్వామ్య పండుగలో ప్రజల స్వరం వినిపించింది. భయంపై ప్రజాస్వామ్యం గెలిచింది” అని ఆయన అన్నారు. బెంగాల్ ప్రజలు భయానికి ముగింపు పలికి, అభివృద్ధికి ఓటు వేసారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రధాని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ సిద్ధాంతాలను కోల్పోయి ‘అర్బన్ నక్సల్స్’ ముఠాలా మారిందని ఆరోపించారు. మావోయిజం భావజాలం ఆ పార్టీలో స్థిరపడిందని, ప్రపంచం తిరస్కరించిన కమ్యూనిజం సిద్ధాంతాలతో కాంగ్రెస్ ముందుకు సాగుతోందని విమర్శించారు. దేశ సంస్కృతి, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోలేక కాంగ్రెస్ క్రమంగా కుంచించుకుపోతోందని పేర్కొన్నారు. మహిళా ఓటర్ల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించిన మోదీ, మహిళల సంక్షేమానికి వ్యతిరేకంగా వ్యవహరించిన పార్టీలను వారు ఓటుతో శిక్షించారని తెలిపారు. “నారీ శక్తి వందన్” వంటి చట్టాలకు వ్యతిరేకంగా నిలిచిన పార్టీలపై మహిళలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని చెప్పారు. మహిళల విశ్వాసం గెలుచుకున్న పార్టీ భవిష్యత్తు బలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గంగా నదిని ప్రస్తావిస్తూ, తన రాజకీయ జీవితంలో గంగా మాతకు ఉన్న ప్రాధాన్యతను మోదీ గుర్తు చేసుకున్నారు. గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు గంగా ప్రవహించే ప్రాంతాల్లో ఇప్పుడు బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయని, ఇది గర్వకారణమని అన్నారు. 2014లో వారణాసి నుంచి పోటీ చేసే సమయంలో తాను చెప్పిన “గంగా మాత పిలిచింది” అనే మాటలను గుర్తుచేసుకుంటూ, ఇప్పటికీ ఆ ఆశీస్సులు తమపై ఉన్నాయని తెలిపారు.
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ‘వికసిత్ భారత్ @2047’ లక్ష్యంలో తూర్పు భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని మోదీ స్పష్టం చేశారు. చారిత్రకంగా బీహార్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో కీలక కేంద్రాలుగా నిలిచాయని వివరించారు. కళింగ సముద్ర వాణిజ్యంలో, అంగ ప్రాంతం వస్త్ర వ్యాపారంలో, బంగ ప్రాంతం సాంస్కృతిక కేంద్రంగా వెలిగిందని చెప్పారు. ఈ మూడు ప్రాంతాల పునరుజ్జీవంతోనే దేశం సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని ఆయన నొక్కిచెప్పారు. బెంగాల్ ప్రజలు ఇచ్చిన మద్దతుతో రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తామని, హింస, ప్రతీకార రాజకీయాలకు ముగింపు పలికి అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి, స్థిరత్వం నెలకొల్పి పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో విజయం సాధించిన పార్టీలకు అభినందనలు తెలిపిన మోదీ, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సమానంగా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. దేశ అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో ఒక కొత్త దశకు నాంది పలికారని, ప్రజలు అభివృద్ధి, సుశాసనాన్ని కోరుకుంటున్నారనే విషయాన్ని స్పష్టంగా చూపించాయని ప్రధాని మోదీ తన ప్రసంగంలో వివరించారు.
