ePaper
Friday, May 15, 2026
ePaper
Homeఎడిటోరియల్నకిలీ రిజిస్ట్రేషన్ మోసం

నకిలీ రిజిస్ట్రేషన్ మోసం

📰 Generate e-Paper Clip

-కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జా కేసు వెలుగులోకి

-రిటైర్డ్ ఉద్యోగి ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభం

-నకిలీ డాక్యుమెంట్లతో పలుమార్లు ప్లాట్ విక్రయం

-డాక్యుమెంట్ రైటర్, రిజిస్ట్రేషన్ అధికారుల ప్రమేయం

-ఆరుగురు నిందితులు అరెస్ట్, జ్యుడీషియల్ కస్టడీ

-మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగింపు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మే 03; (స్పెషల్ ఎడిషన్): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భూకబ్జాకు సంబంధించి నకిలీ రిజిస్ట్రేషన్ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో రిటైర్డ్ ఉద్యోగి దొప్పలపూడి రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది.
రవీంద్ర 1983లో రాంపల్లి గ్రామంలోని సర్వే నంబర్లు 404, 405లో ఉన్న ప్లాట్ నం.108 (300 గజాలు)ను కొనుగోలు చేసినప్పటికీ, ఇటీవల ఆ స్థలంపై ఇతరుల పేర్లతో నకిలీ సేల్ డీడ్లు నమోదైనట్లు గుర్తించారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో నిందితులు ఖాళీగా ఉన్న ప్లాట్లను లక్ష్యంగా చేసుకుని అసలు యజమానులు లేరని భావించి నకిలీ లింక్ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తేలింది. ఈ ప్రక్రియలో డాక్యుమెంట్ రైటర్ ఉదయ్ రెడ్డి, సబ్-రిజిస్ట్రార్ రెహమాన్‌లతో కుమ్మక్కై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి పలుమార్లు అదే ప్లాట్‌ను విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. మొదట ధర్మారావు పేరుతో నకిలీ యజమానిని సృష్టించి, అతని ద్వారా ప్రదీప్ కుమార్‌కు, తరువాత ప్రదీప్ కుమార్ ఆ ప్లాట్‌ను విభజించి ప్రభాకర్, నరేష్‌లకు విక్రయించారు. అనంతరం వారు గుబ్బల వెంకటేశ్వర్ రావు (జీవీఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)కు రిజిస్ట్రేషన్ చేయగా, చివరకు జంగాల శ్రీరామ్, అతని భార్య విజయలక్ష్మి పేర్లపై రిజిస్ట్రేషన్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నిందితులు గుంపుగా కలిసి నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్లను కబ్జా చేసి అమాయకులకు అమ్మి మోసం చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారని తెలిపారు. ఈ కేసులో జంగాల శ్రీరామ్, గుబ్బల వెంకటేశ్వర్ రావు అలియాస్ జీవీఆర్, బందెల్ల ప్రశాంత్ అలియాస్ బాబి, బందెల్ల ప్రభాకర్, పోన్నబోయిన బాలకృష్ణ అలియాస్ బాలు, డాక్యుమెంట్ రైటర్ ఉదయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ కేసును సమర్థంగా ఛేదించిన జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు, ఎస్‌ఐ అనిల్ కుమార్ సహా పోలీసు సిబ్బందిని మల్కాజిగిరి జోన్ డీసీపీ సి.హెచ్. శ్రీధర్ అభినందించారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!