ePaper
Thursday, July 2, 2026
ePaper
Homeఎడిటోరియల్నిరాశకు నై.. సునీల్ కు జై.!

నిరాశకు నై.. సునీల్ కు జై.!

📰 Generate e-Paper Clip

-దివ్యాంగతను జయించి కూరగాయల వ్యాపారంతో జీవన పోరాటం

-చిన్న బండిపైనే పది రకాల కూరగాయలు విక్రయిస్తూ ఆదర్శంగా సునీల్

-పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న యువకుడిపై స్థానికుల ప్రశంసలు

రంగారెడ్డి జిల్లా, జూన్ 29 (స్పెషల్ ఎడిషన్): శారీరక వైకల్యం జీవితానికి అడ్డంకి కాదని, కష్టపడాలనే సంకల్పం ఉంటే ఏ పరిస్థితినైనా అధిగమించవచ్చని తుర్కయంజాల్ కమ్మగూడకు చెందిన దివ్యాంగుడు సునీల్ తన జీవన ప్రయాణంతో నిరూపిస్తున్నాడు. ఎలాంటి ప్రభుత్వ సహాయం, ఆర్థిక అండ లేకపోయినా తన కష్టాన్నే పెట్టుబడిగా మార్చుకుని చిన్న కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించి కుటుంబ జీవనాన్ని గౌరవప్రదంగా కొనసాగిస్తున్నాడు. గత కొంతకాలం నుండి చిన్న చేతిబండిపై దాదాపు పది రకాల తాజా కూరగాయలను విక్రయిస్తూ ఉపాధి పొందుతున్న సునీల్ ప్రతి ఉదయం మార్కెట్‌కు వెళ్లి స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసి వాటిని ఇంటి వద్దకు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. నాణ్యమైన కూరగాయలను అందుబాటు ధరల్లో విక్రయించడంతో స్థానికులు కూడా అతని వద్ద నుంచే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. శారీరక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏనాడూ నిరాశకు లోనుకాకుండా, ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించడం విశేషం. “కష్టపడితేనే గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది” అనే నమ్మకంతో ప్రతి రోజూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్న సునీల్ ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సునీల్ పట్టుదల, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. దివ్యాంగులను జాలితో కాకుండా వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే సునీల్ లాంటి మరెందరో తమ కాళ్లపై తాము నిలబడగలరని అభిప్రాయపడుతున్నారు. సమాజంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయకుండా శ్రమనే ఆయుధంగా, ఆత్మవిశ్వాసాన్నే బలంగా చేసుకుని ముందుకు సాగుతున్న సునీల్ జీవితం నేటి యువతకు నిజమైన స్ఫూర్తిదాయక గాథగా నిలుస్తోంది. అతని చిరునవ్వు, కష్టపడే తత్వం, స్వయం ఉపాధిపై ఉన్న నమ్మకం “వైకల్యం శరీరానికే… మనసుకు కాదు” అనే సందేశాన్ని చాటి చెబుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!