ePaper
Wednesday, August 5, 2026
ePaper
HomeతెలంగాణGHMCకౌలే జగన్నాథం... జగడాల జగన్నాథం..!

కౌలే జగన్నాథం… జగడాల జగన్నాథం..!

📰 Generate e-Paper Clip

-రూ.42.57 లక్షల అంచనా… రూ.44 లక్షలకు పైగా చెల్లింపులు చేసినా అసంపూర్తిగానే ఇంటి నిర్మాణం

-రూ.8.60 లక్షల విలువైన పనులు పెండింగ్‌లో పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణ

-ఇంటికొచ్చి దుర్భాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు

-“న్యాయం జరిగే వరకు పోరాటం ఆపను” అంటూ మీడియా ఎదుట కనపర్తి లక్ష్మణ్ ఆవేదన

ఎల్‌బీనగర్, జూలై 20 (స్పెషల్ ఎడిషన్): విశ్వాసం పెట్టిన వ్యక్తులే నమ్మకాన్ని వమ్ము చేస్తే బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు అనుభవిస్తున్నానని వేదాస్ సంస్థ రాష్ట్ర కోశాధికారి, ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ గౌరవ సలహాదారు కనపర్తి లక్ష్మణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటి నిర్మాణ బాధ్యతలను నమ్మకంతో అప్పగించగా, పనులు మధ్యలోనే నిలిపివేసి, ఇప్పుడు తనపైనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మీడియా సమావేశంలో ఆరోపించారు.

కనపర్తి లక్ష్మణ్ వివరాల ప్రకారం… ఈ ఏడాది జనవరిలో తన ఇంటి నిర్మాణం గురించి ఆలోచిస్తున్న సమయంలో ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం, ఆయన కుమారుడు కౌలే అభిషేక్ కలిసి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. వారి మాటలను విశ్వసించి నిర్మాణ బాధ్యతలను పూర్తిగా అప్పగించినట్లు చెప్పారు. 2026 జనవరి 28న పనులు ప్రారంభించిన వారు జూన్ నెల వరకు కొంత మేర పనులు చేసి, ఆ తర్వాత కీలకమైన నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలేసి వెళ్లిపోయారని ఆరోపించారు. ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.42,57,000 అంచనా వ్యయం నిర్ణయించారని, అయితే తాను ఇప్పటికే యూపీఐ చెల్లింపులు, నిర్మాణ సామగ్రి కొనుగోలు తదితర రూపాల్లో రూ.43,35,000, అదనంగా రూ.78,284 వరకు చెల్లించానని తెలిపారు. అంటే అంచనా వ్యయానికంటే ఎక్కువ మొత్తమే వారికి అందిందని పేర్కొన్నారు. అయినప్పటికీ సుమారు రూ.8.60 లక్షల విలువైన నిర్మాణ పనులు ఇంకా పూర్తి చేయకుండా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా మిగిలిన పనులు పూర్తయితే తాను చెల్లించాల్సిన బకాయి మొత్తం సుమారు రూ.2.53 లక్షలు మాత్రమే ఉంటుందని, అయినా ఈ వాస్తవాన్ని పక్కనపెట్టి “డబ్బులు ఇవ్వకపోవడంతో పనులు ఆపేశాం” అంటూ తనపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. “మిగిలిన పనులు పూర్తి చేయండి… బకాయి మొత్తాన్ని వెంటనే చెల్లిస్తాను” అని పలుమార్లు కోరినా పట్టించుకోలేదని తెలిపారు. అంతటితో ఆగకుండా ఈ నెల 17వ తేదీన కౌలే జగన్నాథం, కౌలే అభిషేక్, ఆవంచ మురళి తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారని లక్ష్మణ్ ఆరోపించారు. ఈ ఘటనపై అదే రోజు ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు మీడియాకు వెల్లడించారు. తన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. తాను ఎన్నో సంవత్సరాలుగా విశ్వకర్మ సమాజ అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నానని, అలాంటి తనకే ఈ పరిస్థితి ఎదురైతే సాధారణ విశ్వకర్మ కుటుంబాలకు న్యాయం ఎలా జరుగుతుందనే ప్రశ్నను లక్ష్మణ్ లేవనెత్తారు. రాష్ట్రంలోని విశ్వకర్మ బంధువులు నిజానిజాలు గుర్తించి తనకు న్యాయం జరిగే వరకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. గమనిక: పై కథనం కనపర్తి లక్ష్మణ్ మీడియాకు వెల్లడించిన వివరాలు, ఆయన చేసిన ఆరోపణల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో పేర్కొన్న ఆరోపణలపై కౌలే జగన్నాథం, కౌలే అభిషేక్, ఆవంచ మురళి తదితర సంబంధిత వ్యక్తుల స్పందన అందాల్సి ఉంది. వారి వివరణ అందిన వెంటనే ప్రచురించడం జరుగుతుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!