ePaper
Friday, October 30, 2026
ePaper
Homeతెలంగాణకాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే తెలంగాణలో కరువు పరిస్థితులు విద్యుత్‌, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం -...

కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే తెలంగాణలో కరువు పరిస్థితులు విద్యుత్‌, సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలం – మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు

📰 Generate e-Paper Clip

ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో, అక్టోబర్ 18 (స్పెషల్ ఎడిషన్):

కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకావడం లేదని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దలేక చేతులెత్తేస్తోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజా సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టకుండా అవినీతి, కమీషన్లు, వాటాల వ్యవహారాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ, సాగునీరు, విద్యుత్ పరిస్థితులపై ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, తెలంగాణకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తెలంగాణ నుంచి ప్రవహిస్తున్న నీటితో ఆంధ్రప్రదేశ్ లబ్ధి పొందుతుండగా, మన రాష్ట్రం మాత్రం సాగునీటి సమస్యలను ఎదుర్కొంటోందని విమర్శించారు. ఇప్పటివరకు కృష్ణా నది నుంచి తెలంగాణ 18 టీఎంసీల నీటిని కూడా వినియోగించుకోలేకపోయిందని పేర్కొన్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌ను ప్రారంభించి ఉంటే రాష్ట్రంలోని చెరువులు, ప్రాజెక్టులు నీటితో నిండేవని, గోదావరి నుంచి 250 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉండేదని అన్నారు. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రయత్నాలు జరిగాయని, ఆ సమయంలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు తలెత్తకుండా సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించకపోవడం, నీటి వనరులను వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు ఏడాది ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల విషయంలోనూ ప్రభుత్వం చొరవ చూపాలని, అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ సరఫరా పరిస్థితులపై మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో నిరంతర విద్యుత్ సరఫరాతో తెలంగాణ ప్రత్యేక గుర్తింపు పొందిందని, ప్రస్తుతం విద్యుత్ కోతలు, సాగునీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిపోయి ఉద్యోగులను బాధ్యులుగా చూపే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ప్రైవేటు బొగ్గు సరఫరా వ్యవహారాల్లో కమీషన్లకు ప్రాధాన్యం ఇస్తూ సింగరేణి సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులకు ఎల్‌నినో ఒక్కటే కారణం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని ఆరోపించారు. విద్యుత్, సాగునీటి నిర్వహణలో ప్రభుత్వానికి సామర్థ్యం లేకపోతే తమకు బాధ్యతలు అప్పగించాలని, ప్రజలకు విద్యుత్‌, నీటిని ఎలా అందించాలో చేసి చూపిస్తామని సవాల్ విసిరారు. తెలంగాణ వనరులను సమర్థంగా వినియోగించకుండా ఇతర రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఉద్యోగులు, రైతులు, అన్ని రంగాల ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కేసీఆర్ నాయకత్వం తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో విద్యుత్‌, సాగునీటి రంగాలను పునరుద్ధరించి, గతంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మళ్లీ ముందుకు తీసుకెళ్లగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!