ePaper
Friday, October 30, 2026
ePaper
Homeతెలంగాణభక్తి భావంతో సద్దుల బతుకమ్మ సంబరాలు - ప్రకృతి పూలకు ఘన నీరాజనాలు

భక్తి భావంతో సద్దుల బతుకమ్మ సంబరాలు – ప్రకృతి పూలకు ఘన నీరాజనాలు

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా బ్యూరో, అక్టోబర్ 18 (స్పెషల్ ఎడిషన్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబురాలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. రంగురంగుల ప్రకృతి పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, భక్తిశ్రద్ధలతో గౌరమ్మను కొలుస్తూ మహిళలు పండుగ సందడిని నింపారు. పూలనే దైవ స్వరూపంగా భావించి, ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్లు, మాజీ మార్కెట్ చైర్‌పర్సన్లు, ప్రస్తుత, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులతో పాటు వివిధ వర్గాలకు చెందిన హిందూ, ముస్లిం, క్రైస్తవ మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సతీమణి గుంటకండ్ల సునీతా జగదీష్ రెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చుతూ సంబురాల్లో భాగస్వాములయ్యారు. పూల పరిమళాలు, మహిళల కోలాటాలు, బతుకమ్మ పాటలతో క్యాంపు కార్యాలయ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. సకల జీవుల సంతోషం, కుటుంబాల సౌభాగ్యం, సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలని గౌరమ్మను ప్రార్థిస్తూ మహిళలు భక్తిప్రపత్తులతో బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే ఈ పండుగ మహిళల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తూ, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను భావితరాలకు అందించే ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకగా ప్రత్యేకతను చాటుకుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!