ePaper
Friday, October 30, 2026
ePaper
Homeతెలంగాణవిశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం నీ సొత్తా?

విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం నీ సొత్తా?

📰 Generate e-Paper Clip

ఐదేళ్ల లెక్కలపై మారోజు వినోద్ కుమార్ నిలదీత

– పదవీకాలంలో చేసిన సేవలెన్ని? కార్యకలాపాల నివేదిక విడుదల చేయాలని డిమాండ్‌

– సంఘం పేరుతో నిధుల సేకరణ జరిగితే లెక్కలేవి? ఆదాయ, వ్యయాల వివరాలు వెల్లడించాలని ప్రశ్న

– పదవి ముగిసినా ఆధిపత్యం ఎందుకు? అధికారిక బాధ్యతలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌

-గౌరవ అధ్యక్షుడి పాత్ర ఏమిటి? లాలుకోట వెంకటాచారి ప్రాధాన్యంపై వివరణ ఇవ్వాలని ప్రశ్న

– అక్టోబర్ చివరికల్లా లెక్కలు తేలాలి! పారదర్శకత, జవాబుదారీతనమే ప్రాతిపదిక కావాలని హితవు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 18 (స్పెషల్‌ ఎడిషన్‌):

రిజిస్ట్రేషన్ నంబర్ లేని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ మాతృ సంఘం వ్యవహారాల్లో ప్రధానకార్యదర్శి హోదాలో పనిచేసిన చొళ్లేటి కృష్ణమాచారి అవినీతి, అక్రమాలను త్వరలోనే వెలికితీస్తామని తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్, హైకోర్టు అడ్వకేట్ మారోజు వినోద్ కుమార్ డిమాండ్‌ చేశారు. మాతృ సంఘంలో ప్రధాన కార్యదర్శిగా ఐదేళ్లపాటు కొనసాగిన చొల్లేటి కృష్ణమాచారి పదవీకాలంలో చేపట్టిన కార్యక్రమాలు, సంఘం పేరుతో సేకరించిన నిధులు, వాటి వినియోగం, పదవీకాలం ముగిసిన అనంతరం ఆయన నిర్వహిస్తున్న పాత్రపై స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. సంఘం ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, సభ్యుల విశ్వాసంతో నడిచే సామూహిక సంస్థ అని పేర్కొంటూ.. పదవులు సేవ చేయడానికి తప్ప శాశ్వత ఆధిపత్యం చెలాయించడానికి కాదని వ్యాఖ్యానించారు.

ఐదేళ్లలో సాధించిన ప్రగతి ఏమిటి?

రిజిస్ట్రేషన్ లేని మాతృ సంఘం పేరుతో ప్రధాన కార్యదర్శిగా ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించడం సాధారణ విషయం కాదని, అంత సుదీర్ఘ కాలంలో సమాజానికి చేసిన సేవలపై స్పష్టమైన నివేదిక ఉండాలని మారోజు వినోద్ కుమార్  పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విశ్వబ్రాహ్మణ కుటుంబాల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పేద విద్యార్థుల విద్యకు ఎంతమేర సహకరించారు? ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచిన సందర్భాలెన్ని? సమాజ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలేమిటి? వాటికి ఖర్చు చేసిన నిధులెన్ని? అనే ప్రశ్నలకు సమాధానాలు వెల్లడించాలని కోరారు. పదవిలో ఉన్న సమయంలో నిర్వహించిన సమావేశాలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సభ్యులకు అందించిన సేవలు, ఆర్థిక సహాయం పొందిన వారి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను సభ్యుల ముందుంచాలని సూచించారు. కేవలం పదవులు నిర్వహించామని చెప్పుకోవడం కాకుండా, ఆ పదవుల ద్వారా సమాజానికి చేసిన మేలు ఏమిటో వివరించాల్సిన బాధ్యత ప్రధాన కార్యదర్శిపై ఉందన్నారు. గత ఐదేళ్ల పనితీరుపై సమీక్ష జరగకుండా మళ్లీ పదవులు, ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం, చర్చించడం సమంజసమేనా? అని ప్రశ్నించారు.

సంఘం పేరుతో నిధులు సేకరించినట్లయితే లెక్కలు చూపాలి!

సంఘం పేరుతో విరాళాలు, చందాలు లేదా ఇతర రూపాల్లో నిధులు సేకరించి ఉంటే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని వినోద్ కుమార్ డిమాండ్‌ చేశారు. ఎవరెవరి నుంచి ఎంత మొత్తం సేకరించారు? ఏ ప్రయోజనం కోసం నిధులు తీసుకున్నారు? వాటికి రసీదులు జారీ చేశారా? సేకరించిన మొత్తాలను సంఘం బ్యాంకు ఖాతాలో జమ చేశారా? ఏయే కార్యక్రమాలకు ఎంత ఖర్చు చేశారు? ఖర్చులకు కార్యవర్గం ఆమోదం ఉందా? ఆదాయ, వ్యయాలపై ఆడిట్‌ నిర్వహించారా? అనే అంశాలను స్పష్టం చేయాలని కోరారు. నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు ఉన్నాయంటే అవే తుది నిర్ధారణలు కావు. అయితే, ఆర్థిక వ్యవహారాలపై సందేహాలు తలెత్తినప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత నిర్వాహకులపై ఉంటుంది. అందువల్ల రసీదులు, ఖర్చుల రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, ఆడిట్‌ నివేదికలను సభ్యుల పరిశీలనకు అందుబాటులో ఉంచాలని ఆయన పేర్కొన్నారు. లెక్కలు స్పష్టంగా ఉంటే వాటిని వెల్లడించడానికి వెనుకాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సంఘం పేరు చెప్పి నిధులు సేకరించినట్లయితే అవి సంఘ ప్రయోజనాలకే వినియోగించారా? ఏదైనా ఆర్థిక అవకతవక జరిగిందనే అనుమానాలుంటే వాటిని నిబంధనల ప్రకారం పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నారా? అనే అంశాలపై సంబంధిత వ్యక్తులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని అన్నారు. 5ఏళ్ల పాటు అరాచకం సృష్టిస్తూ, సంఘీయులకు నమ్మకద్రోహం చేస్తూ అదే సమయంలో ఆర్థిక పారదర్శకతను ప్రశ్నించడం సభ్యుల హక్కు అని స్పష్టం చేశారు.

పదవి ముగిసినా పెత్తనం ఎందుకు?

రిజిస్ట్రేషన్ లేని సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పదవీకాలం ముగిసిన తర్వాత కూడా సంఘ వ్యవహారాల్లో వ్యక్తిగత ఆధిపత్యం కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయని బాలనరసింహాచారి పేర్కొన్నారు. అయితే, ఈ విమర్శలపై వాస్తవాలు తేలాలంటే చొల్లేటి కృష్ణమాచారి ప్రస్తుతం సంఘంలో ఏ అధికారిక హోదాలో కొనసాగుతున్నారు? ఆయనకు ఉన్న అధికారాలేమిటి? ఏ నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది? కార్యవర్గం ఆమోదంతోనే వ్యవహారాలు సాగుతున్నాయా? అనే అంశాలను స్పష్టం చేయాలని గౌరవ అధ్యక్షులు లాలుకోట వెంకటాచారిని కోరారు. ప్రధాన కార్యదర్శి పదవి అనేది శాశ్వత హక్కు కాదని, సభ్యులు అప్పగించిన బాధ్యత మాత్రమేనని పేర్కొన్నారు. పదవీకాలం ముగిసిన తర్వాత సంఘ రాజ్యాంగం, సంఘీయుల నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనన్నారు. ఒక వ్యక్తి అభిప్రాయమే సంఘ నిర్ణయంగా మారితే కార్యవర్గం, అధ్యక్షుడు, ఇతర బాధ్యులు, సాధారణ సభ్యుల పాత్ర ఏమిటని ప్రశ్నించారు. సంఘంలో నాయకత్వం వహించాలనుకునేవారు ముందుగా సభ్యుల విశ్వాసాన్ని పొందాలని, తమ పనితీరుపై వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. వ్యక్తిగత ఆధిపత్యం కంటే సమష్టి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, సంఘ ప్రయోజనాల విషయంలో ఎవరూ నిబంధనలకు అతీతులు కారని పేర్కొన్నారు.

అధ్యక్షుడి పాత్రపై స్పష్టత ఏది?

సంఘ అధ్యక్షుడు మదన్‌మోహనాచారికి తగిన ప్రాధాన్యం కల్పించారా? సంఘ నిర్ణయాల్లో ఆయన పాత్ర ఏమిటి? కార్యవర్గ సమావేశాల్లో కీలక అంశాలు చర్చించి తీర్మానాలు చేస్తున్నారా? అనే ప్రశ్నలపై కూడా స్పష్టత అవసరమని బాలనరసింహాచారి అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడిని ఈ ఐదేళ్లపాటు పక్కన పెట్టారని విమర్శలు నిజమో కాదో సంబంధిత రికార్డులు, సమావేశాల వివరాలు, తీర్మానాల ఆధారంగా తేల్చాలని సూచించారు. సంఘం నిర్వహణ ఒకరి ఇష్టానుసారం కాకుండా రాజ్యాంగం, నిబంధనలు, కార్యవర్గ నిర్ణయాల ప్రకారం సాగాలని అన్నారు. విభేదాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, కీలక నిర్ణయాలను అధికారికంగా నమోదు చేయాలని, ఆర్థిక లావాదేవీలకు తగిన ఆధారాలు ఉండాలని పేర్కొన్నారు. సభ్యులకు సమాచారం అందించకుండా నిర్ణయాలు తీసుకుంటే సంఘంలో పారదర్శకత ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

అక్టోబర్ చివరికల్లా ముందే గత పనితీరుపై సమీక్ష!

తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ/విశ్వకర్మ సంఘం (1217/2016)కు సంబంధించిన న్యాయపరమైన పరిణామాలు కొనసాగుతున్నాయని, మరోవైపు రిజిస్ట్రేషన్‌ నంబరు లేని మాతృ సంఘం గౌరవ అధ్యక్షుడు లాలుకోట వెంకటాచారి డిసెంబరులో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గత ఐదేళ్ల పనితీరుపై సమీక్ష జరగాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. అక్టోబర్ చివరికల్లా సత్వరమే సంఘం నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు, సభ్యుల హక్కులు, నాయకత్వ బాధ్యతలపై స్పష్టత తీసుకురావాలని కోరారు. అన్ని వ్యవహారాలలో  గతంలో నిర్వహించిన బాధ్యతలకు సంబంధించిన నివేదికను సభ్యుల ముందుంచాలని, తమ సేవలను వివరించాలని, ఆర్థిక లెక్కలపై ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని అన్నారు. పదవుల కోసం పోటీ పడటానికి ముందు సమాజానికి చేసిన సేవలను నిరూపించుకోవడం అవసరమని పేర్కొన్నారు. సంఘం గుర్తింపు, రిజిస్ట్రేషన్‌, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలు వర్తించే నిబంధనలు, అధికారిక రికార్డుల ఆధారంగా స్పష్టత పొందాలని సూచించారు. న్యాయస్థానాల్లో ఉన్న వ్యవహారాలపై ప్రచారాలకంటే అధికారిక ఉత్తర్వులకే ప్రాధాన్యం ఇవ్వాలని, సంఘ భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు సభ్యుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు.

ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే!

చొల్లేటి కృష్ణమాచారి తనపై వస్తున్న విమర్శలకు స్పందించి ఐదేళ్ల కార్యకలాపాల నివేదిక విడుదల చేస్తారా? సంఘం పేరుతో సేకరించిన నిధుల వివరాలు వెల్లడిస్తారా? ఆదాయ, వ్యయాలపై ఆడిట్‌ నివేదికను సభ్యుల ముందుంచుతారా? పదవీకాలం ముగిసిన తర్వాత తన అధికారిక పాత్ర ఏమిటో స్పష్టం చేస్తారా? గౌరవాధ్యక్షుడు, అధ్యక్షుడు, కార్యవర్గం, సభ్యుల నిర్ణయాలకు అనుగుణంగా సంఘ వ్యవహారాలు సాగుతున్నాయని నిరూపించే రికార్డులు అందిస్తారా? అని వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఈ అంశాలపై సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోవాలని, అవసరమైతే సంఘ నిబంధనల ప్రకారం ఆర్థిక లెక్కలను పరిశీలించాలని కోరారు. ఆరోపణలు నిజమో కాదో ఆధారాలతో తేల్చడం, సంబంధిత వ్యక్తులకు వివరణ ఇచ్చే అవకాశం కల్పించడం, సభ్యుల ముందు వాస్తవాలను ఉంచడం ద్వారానే వివాదాలకు ముగింపు పలకవచ్చని అభిప్రాయపడ్డారు. విశ్వబ్రాహ్మణ సమాజంలో సేవాభావం, అనుభవం, నాయకత్వ లక్షణాలు కలిగిన అనేకమంది ఉన్నారని, సంఘం ఒక్కరి చుట్టూ తిరిగే పరిస్థితి కాకుండా అందరికీ సమాన గౌరవం కల్పించే విధంగా నిర్వహణ సాగాలని ఆయన పేర్కొన్నారు. “సంఘం ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు. పదవి శాశ్వత అధికారం కాదు. సంఘం పేరుతో బాధ్యతలు నిర్వహించినవారు సభ్యులకు జవాబుదారీగా ఉండాలి. ప్రచారాలకంటే పనితీరు, మాటలకంటే లెక్కలు, వ్యక్తిగత ఆధిపత్యం కంటే సమష్టి నిర్ణయాలే సంఘానికి బలమని” వినోద్ కుమార్ స్పష్టం చేశారు. పదవి తాత్కాలికం.. సమాజం శాశ్వతం! పెత్తనం కాదు.. సేవ కావాలి! ప్రచారం కాదు.. పనితీరు చూపాలి! అనుమానాలకు తావులేకుండా లెక్కలు వెల్లడించాలని మారోజు వినోద్ కుమార్  డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!