ఈటల శ్రేణుల ఆగ్రహం!.. వివరణ ఇవ్వాలంటున్న అభిమానులు?
స్థానికుల ఉద్యోగాలపై ఆరోపణలు..మౌనం పై ఎందుకంటూ ప్రశ్నలు
వనస్థలిపురం, సెప్టెంబర్ 26 (స్పెషల్ ఎడిషన్):
వనస్థలిపురం-చింతలకుంటలో అక్టోబర్ 1న సినీ ప్రముఖుల సమక్షంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ 45వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ సంస్థ విడుదల చేసినట్లు చెబుతున్న ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఎల్బీనగర్ నియోజకవర్గంలో రాజకీయ చర్చకు దారితీసింది. ప్రోటోకాల్ పరంగా స్థానిక మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫోటో ఆహ్వాన పత్రికలో లేకపోవడంపై ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఫోటో ప్రప్రథమంగా ఉండటం, మరోవైపు కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఫోటోకు రెండో ప్రాధాన్యత లభించడం చర్చకు మరింత ఆజ్యం పోసింది. స్థానిక ఎంపీగా ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఆహ్వాన పత్రికలో స్థానం (ఫోటో) ఎందుకు కల్పించలేదనే ప్రశ్నలు ఈటెల వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. కార్పొరేట్ స్థాయిలో భారీ హంగులతో షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేస్తున్న సంస్థకు స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోటోకాల్ విషయంలో స్పష్టత ఉండాల్సిన అవసరం ఉందని పలువురు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఆహ్వాన పత్రికలో ఎవరి ఫోటో ఉండాలి, ఎవరి ఫోటో ఉండకూడదనే అంశం సంస్థ నిర్ణయమే అయినప్పటికీ, స్థానిక ఎంపీని విస్మరించినట్లుగా కనిపించడం వెనుక కారణమేంటనే చర్చ మాత్రం నియోజకవర్గంలో జోరందుకుంది.
ఇదిలా ఉండగా షాపింగ్ మాల్‌లో ఉద్యోగాల కల్పన విషయంలో స్థానికులకు కాకుండా కేవలం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికే అవకాశాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు కూడా తాజాగా తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? ఉద్యోగ నియామకాల్లో సంస్థ అనుసరిస్తున్న విధానమేంటి? స్థానిక యువతకు ఎంత మేర అవకాశాలు కల్పిస్తున్నారు? అన్న విషయాలపై కూడా సంస్థ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
ఆహ్వాన పత్రికలో ఉన్న సామ రంగారెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి తదితరులు ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోందని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించే సంప్రదాయం పాటించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.
సిఎంఆర్ వంటి ప్రముఖ సంస్థ కొత్త 45వ బ్రాంచ్ ప్రారంభిస్తున్న సందర్భంలో ఆహ్వాన పత్రికే రాజకీయ వివాదానికి కేంద్రబిందువుగా మారడం చర్చనీయాంశంగా మారింది. ఎంపీ ఫోటో ఎందుకు లేదు? ఆహ్వాన పత్రిక రూపకల్పనలో ఏదైనా పొరపాటు జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగానే విస్మరించారా? స్థానికులకు ఉద్యోగాల విషయంలో సంస్థ విధానం ఏమిటి? వంటి ప్రశ్నలకు సిఎంఆర్ యాజమాన్యం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరోపణలపై సంస్థ అధికారిక వివరణ ఇస్తేనే ఈ వివాదానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది.
